Venkaiah Naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బిజెపిలో సీనియర్ నేతగా ఉన్న వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత.. రాజకీయాల వైపు వెళ్లలేదు. పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసినవేనని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ గా మారుతోంది.
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు అని.. ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులుగా పేర్కొన్నారు. రాజకీయం కంటే సినిమాల ప్రభావం ప్రజలపై అధికమని చెప్పుకొచ్చారు. కొంతమంది రాజకీయాల్లో ఇప్పుడు నటిస్తున్నారని.. అటువంటి వారికి ప్రజల్లో చోటుండదని వెంకయ్య అన్నారు.
అయితే వెంకయ్య మాటలను వక్రీకరిస్తూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారానికి తెర తీశారు. రాజకీయరంగంలో రాణిస్తున్న సినిమా వారి గురించి వెంకయ్య నాయుడు ప్రస్తావించలేదు. రాజకీయాల్లో ఉంటూ రంగులు మార్చుతున్న వారి గురించి మాత్రమే ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో.. వివాదాలు తెర తీయడానికి కొందరు వెంకయ్య నాయుడు మాటలను అస్త్రాలుగా తీసుకున్నారు. వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కోసమే అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పవన్ టిడిపి తో పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రగిల్చేందుకే ఇటువంటి పోస్టులు పెడుతున్నారు అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.