ABN RK Kotha Paluku
ABN RK Kotha Paluku: “కాలు జారినా మంచిదే. కానీ నోరుజారకూడదు..ఇలా “దొంగలందరి ఇంటిపేరు మోడీ అని ఎందుకు ఉంటుందో తెలుసా” అని తలతిక్క వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ దాని ఫలితం అనుభవిస్తున్నారు. దీన్ని చూసైనా తెలుగు రాష్ట్రాల్లో నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సింది. కానీ వారు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇది అంతిమంగా వారి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది” అని వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో పేర్కొన్నారు. ప్రతి ఆదివారం వర్తమాన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో సంపాదకీయం రాసే ఆయన.. ఈవారం కూడా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పలు పరిస్థితులపై సూటిగా సుత్తి లేకుండా రాస్కొచ్చారు.
నోరు జాగ్రత్త
“ఇటీవల తానా మహాసభల్లో ఉచిత విద్యుత్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సాధారణంగానే ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే భారత రాష్ట్ర సమితి.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇది ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి బంధకంగా మారింది. చివరికి అమెరికా నుంచి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత కరెంటు లెక్కలను పూర్తి గణాంకాలతో సహా వివరించడంతో భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా డైలమాలో పడింది.. అయితే మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని అనుకున్న భారతీయ జనతా పార్టీ అనివార్యంగా మూడవ స్థానానికి పడిపోయింది. ఈ పార్టీ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆవేశంగా మాట్లాడితే దానిని భారత రాష్ట్ర సమితి ఆయుధంగా మార్చుకుంటుంది. ఉచిత విద్యుత్ విషయంలో భారత రాష్ట్ర సమితి చేసింది కూడా ఇదే.. మరికొద్ది నెలలో ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు జాగ్రత్తగా ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అని వేమూరి రాధాకృష్ణ హెచ్చరించారు.. రేవంత్ రెడ్డి దూకుడు మంచిదే అయినప్పటికీ, అది అన్నివేళలా శ్రేయస్కరం కాదని సూటిగా చెప్పేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం విపరీతంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో నేతలు జాగ్రత్తగా ఉండని పక్షంలో కేసీఆర్ అమాంతం కబళిస్తారని హెచ్చరికలు జారీ చేశారు. ఈమధ్య కాంగ్రెస్ పార్టీని తరచూ వెనకేసుకొస్తున్న రాధాకృష్ణ.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగిందని చెప్పకనే చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి ఎదురు దాడికి దిగడంతో భారత రాష్ట్ర సమితి డిఫెన్స్ లో పడిందని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ తేనె తుట్టేను కదిలించారు
తెలంగాణ విషయాలు మాత్రమే కాకుండా ఆంధ్రకు సంబంధించి కూడా వర్తమాన రాజకీయ అంశాలను రాధాకృష్ణ ప్రస్తావించారు. “వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై చేసిన విమర్శలు పవన్ కళ్యాణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు అనేవారు సమాంతర వ్యవస్థగా ఎదిగిపోయారు. వీరికి ప్రభుత్వం నుంచి ప్రతినెల గౌరవ వేతనం లభిస్తోంది. వీరికి అనుసంధానంగా ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది. వలంటీర్లు సమాంతర వ్యవస్థగా ఎదిగిపోయిన నేపథ్యంలో వారిని గురించి ప్రశ్నించేందుకు మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడేది. కానీ ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ ఏ మాత్రం బెదరకుండా ప్రశ్నించారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్ల పాత్ర ఉందన్నట్టు ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వీరికి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులు సపోర్టుగా నిలిచారు. సరిగ్గా ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రస్తావించడంతో అధికార పార్టీ వెనక్కి తగ్గింది అని” రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. తొలిసారిగా ఆయన వ్యాసంలో చంద్రబాబు పాలన కాలంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు అవినీతికి ఆలవాలంగా మారాయని రాస్కొచ్చారు. సమాంతర వ్యవస్థగా మారిన వలంటీర్ల వ్యవస్థను తప్పు పట్టక పోవడం చంద్రబాబు చేసిన తప్పు అని రాధాకృష్ణ సూటిగా చెప్పేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలవల్ల అధికార వైఎస్ఆర్సిపి సైలెంట్ అయిందని, పవన్ కళ్యాణ్ ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించిందని, ఇది సరైన విధానం కాదని రాధాకృష్ణ తన పచ్చ భక్తిని చాటుకున్నారు. ఎటొచ్చీ చంద్రబాబు అనేవాడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి అనే కోణంలోనే రాధాకృష్ణ రాసుకురావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
కెసిఆర్ కు చెంపపెట్టు
పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాకుండా కేసీఆర్ మనవడు హిమాన్షు రావు ప్రారంభించిన పాఠశాల, ఆ సందర్భంగా అతడు మాట్లాడిన మాటలను రాధాకృష్ణ ఉటంకించాడు. బంగారు తెలంగాణ చేశాను, దేశంలో మార్పు తీసుకొస్తాను అని జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ ను రాధాకృష్ణ తూర్పార పట్టాడు. కెసిఆర్ బంగారు తెలంగాణ పేరుతో చేస్తున్న మోసాన్ని ఆయన మనవడు హిమాన్షు రావు ఎండ కట్టాడని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. విరాళాలు సేకరించి పాఠశాలను అభివృద్ధి చేయడం పట్ల అభినందించాడు.. మొత్తానికి అటు ప్రతిపక్షాలను, ఇటు అధికార పక్షాన్ని తన రాతలతో రాధాకృష్ణ చెడుగుడు ఆడుకున్నాడు.