ABN RK : “నలుపు నారాయణ మెచ్చు. తెలుపు ఎవడు మెచ్చు.” అని వెనుకటి కి ఒక సామెత ఉంది. శారదా పీఠం స్వామి చెప్పాడో, ఆ కడప చర్చి ఫాస్టర్ చెప్పాడో గానీ… నారాయణుడికి నచ్చిన నలుపు ఏపీ సీఎం జగన్ కు నచ్చడం లేదు. నలుపు అంటున్నారు.. అది రంగు కాదా? జగన్ చరిత్ర కు నలుపు లేదా? అనే ప్రశ్నలు ఇక్కడ అప్రస్తుతం. జగన్ అంటేనే ఓ మోనో పొలీ. ఎవడి మాటా వినడు. సీతయ్య టైపు కాబట్టి ఎవరూ అడ్డు చెప్పరు. ఎవరైనా చెప్పేది వింటే ఏపీ అలా ఎందుకు ఉంటుంది. బటన్ ముఖ్యమంత్రి అని పేరు ఎందుకు వస్తుంది. అప్పులు దొరికితే తప్ప పించన్లు ఇవ్వలేని దుస్థితి ఎందుకు వస్తుంది. లోతుల్లోకి పోవడం లేదు గానీ..ఇప్పుడు ఏపీ పరిస్థితి బాగో లేదు. మళ్ళీ ఫ్యాన్ గాలి వీస్తే ఈసారి అక్కడ ప్రజలు ముక్కు నిండా గాలి కూడా పీల్చుకునే పరిస్థితి కూడా లేదు ఉండదు.

మరి వారు ఎందుకు వేసుకున్నారు
కొణిజేటి రోశయ్య బతికున్నప్పుడు.. టిడిపి నాయకులను ఒక ఆట ఆడుకునేవారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తక్కువ వాడు ఏమీ కాదు. అప్పట్లో వీరిద్దరూ వేసే ప్రశ్నలకు టిడిపి నాయకులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలే వారు.. ఇప్పుడు రాజకీయాలంటే బూతులుగా మారిపోయాయి కానీ.. అప్పట్లో ఈ ఇద్దరు నాయకులు టెంపర్మెంట్ తో అడిగే ప్రశ్నలు ప్రత్యర్థి పార్టీ నాయకులకు చుక్కలు చూపించేవి. ఇక ఇప్పుడు జర్నలిజం అనేది పూర్తిగా అమ్ముడుపోయింది కాబట్టి.. అడిగేవారు ఒకరో ఇద్దరో ఉన్నారు. వారిలో ఏబీఎన్ రాధాకృష్ణ ఒకరు. గతంలో రాసిన వ్యాసాల్లో మేం చెప్పినట్టు ఆయన వారం వారం రాసే కొత్త పలుకులో చంద్రబాబు ప్రస్తావన లేకుంటే రాధాకృష్ణ టెంపర్ మెంట్ మామూలుగా ఉండదు. పొరపాటున ప్రస్తావన వస్తే అది మమ్మాటికి పసుపు డప్పు లాగా కనిపిస్తుంది. అయితే ఈ ఆదివారం రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎత్తుకున్నాడు. బహుశా చాలామంది జర్నలిస్టులు ఈ పాయింట్ గుర్తించలేదు. ఈమధ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నలుపు అనే పిలుపు వినిపిస్తే చాలు ఆమడ దూరం వెళ్ళిపోతున్నాడు. నలుపు రంగు కనిపిస్తే చాలు కిలోమీటర్ దూరం వెళ్ళిపోతున్నాడు. ఆయన సభలకు వచ్చేవారు నలుపు రంగు దుస్తులు ధరించవద్దని ఆదేశాలు వెళ్లాయి. తనని కలిసేవారు ఆ నలుపు రంగు దుస్తులతో వస్తే బయటకు వెళ్లాలనే షరతులు నడుస్తున్నాయి. ఇందుకు కారణం ఏమిటో తెలియదు కానీ… దీనిని మాత్రం ఆర్కే భలే పట్టుకున్నాడు. “ఏమయ్యా జగనూ.. అంబేద్కర్ మహాశయుడు రాసిన రాజ్యాంగం ప్రకారం.. ఏ రంగునైనా నువ్వు ఇష్టపడొచ్చు. లేదా తిరస్కరించవచ్చు. ఆ హక్కు నీకుంది. కానీ మొన్నటిదాకా తెల్లటి మీసాలతో, గడ్డాలతో కనిపించిన అంబటి రాంబాబు, మల్లాది విష్ణు నలుపు రంగు వేసుకున్నారు చూసావా? ఇప్పుడు వారిని ఏం చేస్తావు?” అంటూ ఎగతాళి చేశాడు. అంతేకాదు ప్రజల్లో జగన్ ప్రభుత్వం పై అసంతృప్తి పెరిగిపోతున్నదని ఒక హింట్ ఇచ్చాడు.
మరి ఆర్కే మాటేమిటి?
నలుపు రంగు గురించి వీర లెవెల్లో కొత్త పలుకు రాసిన ఆర్కే కూడా తను నెరిసిన జుట్టుకు నల్ల రంగు వేసుకుంటాడు. ఒకవేళ ఇదేంటని అడిగితే.. నేను జగన్ మాదిరి నలుపు రంగు ద్వేషిని కాదు అని చెప్పుకుంటాడేమో.. ఆర్కే రాసిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ పార్టీలో మోనోపోలీ. జీవితకాలం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న వ్యక్తి.. తనకు నచ్చని వారిని పక్కన పెట్టే రకం. మొన్నటిదాకా జగన్ అంటే వీర లెవల్లో అభిమానం చెప్పిన కొడాలి నాని, అనిల్ కుమార్ ఇప్పుడు పత్తా లేరు. చేతిలో “మంత్రి” దండం కూడా లేదు. పైగా ఉన్న పార్టీ పదవులు కూడా పోయాయి.. మునుముందు ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. కళ్ళ ముందు మేకతోటి సుచరిత ఉదంతం కనిపిస్తూనే ఉంది. ఆయనప్పటికీ ఫ్యాన్ పార్టీ నాయకులు కిమ్మనరు. జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పరు.. నల్లరంగు చున్నీలు తీసేయించిన వ్యక్తికి.. ఎదురు సమాధానం చెప్తే ఏమైనా ఉందా? బహుశా ఆ భయంతోనే వాళ్ళు బతుకుతున్నారు.. వాళ్ల నలుపు జగన్ కు తెలుసు కాబట్టే… నలుపు రంగు ను బూచిగా చూపి ఆట ఆడుకుంటున్నాడు.. ఇలా సాగిపోయింది ఆర్కే కొత్త పలుకు ఈ ఆదివారం విశ్లేషణ. ఏ మాటకు ఆ మాటే… వైఎస్ఆర్సిపి నాయకులు చేయలేని పని రాధాకృష్ణ చేస్తున్నారు.. అందుకే కాబోలు కృతజ్ఞతగా ఆంధ్రజ్యోతి పేపర్ కు వార్షికోత్సవ ప్రకటనలు కూడా ఇస్తున్నారు. రాజకీయాల్లోనే కాదు… బయట సర్కిల్లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఇది రాధాకృష్ణ వెర్షన్ లో అయితే నూటికి నూరుపాళ్ళు నిజం. జగన్మోహన్ రెడ్డి నలుపు రంగును అసహ్యించుకునేంత నిజం.