ABN Radhakrishna: జగన్ లేకుండా రాయలేవా రాధాకృష్ణ

వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను పల్లెత్తు మాట అనడానికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాయకులు ముందుకు రారు. కారణం హైదరాబాదులో ఆస్తులు ఉండడమే. అదే ఏపీ సీఎం జగన్ విషయానికి వచ్చేసరికి ఇష్ట రాజ్యంగా విమర్శలు చేస్తుంటారు.

Written By: Dharma, Updated On : November 27, 2023 5:23 pm
Follow us on

ABN Radhakrishna: తన కంట్లో దూలాన్ని పెట్టుకుని… ఎదుటివారి కంట్లో నలుసును వెతకడం, ఎత్తిచూపడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి విద్యలో ఆరితేరిపోయాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. నిత్యం జగన్మోహన్ రెడ్డి పై విషపు రాతలతో, కొత్త పలుకులతో విరుచుకుపడుతున్నాడు పసుపుదళ అస్మదీయుడు. టిడిపి అధినేత చంద్రబాబు కోసం అనునిత్యం తపించే వ్యక్తుల్లో ఆర్కే ముందు వరుసలో ఉంటారు. టిడిపి గురించి చంద్రబాబు కూడా రాధాకృష్ణలా ఆలోచించరు. అందుకే వారాంతంలో చంద్రబాబు కోసం.. జగన్ పై వ్యతిరేక రాతలతో విరుచుకుపడుతుంటారు. ఒకవైపు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అక్కడి విషయాలపై సంపాదకీయం రాయాల్సి ఉన్నా.. అలవాటులో పొరపాటో.. గ్రహ పాటు తెలియదు కానీ.. ఈవారం కొత్త పలుకులో సైతం జగన్ పై విషం చిమ్మే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ను పల్లెత్తు మాట అనడానికి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాయకులు ముందుకు రారు. కారణం హైదరాబాదులో ఆస్తులు ఉండడమే. అదే ఏపీ సీఎం జగన్ విషయానికి వచ్చేసరికి ఇష్ట రాజ్యంగా విమర్శలు చేస్తుంటారు. జగన్ అంటేనే ఉవ్వెత్తిన ఎగసిపడతారు. అందులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి చెప్పనక్కర్లేదు. ఆంధ్రజ్యోతిలో రాసిన ప్రతి అక్షరం జగన్ కు వ్యతిరేకమే. జగన్ ను తప్పు పట్టడమే. అదే కెసిఆర్ విషయానికి వచ్చేసరికి మాత్రం నోరు,నాలుకలు రెండు మూతబడతాయి. ఏపీలో అభివృద్ధి దారుణంగా పడిపోయిందని.. దీనికి జగన్ సర్కార్ చర్యలే కారణమని ఈ వారపు కొత్త పలుకులో ఆర్కే రాసుకోచ్చారు. కానీ తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అక్కడ ఓటర్లకు దిశా నిర్దేశం చేయాలన్న ఆలోచన రాలేదు. ఎటువంటి విశ్లేషణలు చేయలేదు.

ఏపీలో అభివృద్ధి, మౌలిక వసతులను గాలికి వదిలేసారని ఆర్కే విశ్లేషించారు. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదని తేల్చేశారు. ఇన్నాళ్లు తెలంగాణ విషయంలో రాసిన రాతలు ఉత్తమాటేనని తనకు తాను సవరించుకున్నారు. రాధాకృష్ణకు తన ఆస్తులు ముఖ్యం. చంద్రబాబు ప్రయోజనం ముఖ్యం. తెలంగాణలో చంద్రబాబు లేరు కాబట్టి.. తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు కాబట్టి.. తెలంగాణ ఎన్నికల గురించి పట్టించుకోవడం లేదు. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్ అర్జెంటుగా అధికారం నుంచి దిగిపోవాలి. చంద్రబాబు అంత వేగంగా అధికారాన్ని అందుకోవాలి. ఆ తాపత్రయంలో భాగంగా రాస్తున్న రాతలు ప్రజలకు యావగింపు పుట్టిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పై ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. ఆర్థిక గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం వెల్లడించే నీతి ఆయోగ్ వివరాలపై అవగాహన లేదో? ఉందో? తెలియదు కానీ.. సర్వస్వం తనకే తెలిసినట్టు.. దానినే ప్రజలు నమ్ముతున్నట్లు భ్రమిస్తున్నారు.