Homeఆంధ్రప్రదేశ్‌Jagan vs ABN RK : జగన్ పై ఆర్కే పగ ఇప్పట్లో చల్లారేలా లేదే

Jagan vs ABN RK : జగన్ పై ఆర్కే పగ ఇప్పట్లో చల్లారేలా లేదే

Jagan vs ABN RK : ఆ రాత ఏమిటో.. ఆ కలం తీరేమిటో… ఎత్తుకునే ఆ లీడ్ ఏమిటో తెలియదు గానీ.. వారం వారం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే రాసే కొత్త పలుకులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేక స్వరమే వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అవుతున్నదని రాధాకృష్ణ బాధపడిపోతూ ఉంటాడు.. అందులో తప్పు లేకపోవచ్చు. కాకపోతే జగన్ కు పాలన చేతకాకపోతే అందుకు సమర్ధుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని ముక్తాయింపు దేనికి? ప్రజలకు అంతర్గతంగా సంకేతాలు ఇవ్వడం దేనికి? ఆ మాటకు వస్తే చంద్రబాబు పాలన వెలగబెట్టిన గొప్ప ఘనకార్యాలు ఏమున్నాయని? అదే చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో కాలయాపన చేసింది నిజం కాదా? కేవలం సొంత సామాజిక వర్గం వారికి అందలం ఎక్కించేందుకు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడింది నిజం కాదా? అంత గొప్ప విజన్ ఉన్న నాయకుడైతే రాజధాని కట్టేందుకు ఐదు సంవత్సరాలు సరిపోలేదా? రైతులు స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారు కదా? మరి దానికి రాధాకృష్ణ దగ్గర సమాధానం ఉండదు.

ఆ తీరేమిటో అర్థం కాదు

బిజెపితో పెట్టుకుంటే ఎవరైనా మాటాషే.. మోదీ, అమిత్ షా తో అంత ఈజీ కాదు. వారంతా మహా ఘటికులు. కెసిఆర్ ఎంత తొందరగా సయోధ్య కుదుర్చుకుంటే అంత మంచిది. ఇలా సాగిపోతూ ఉంటాయి రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాఖ్యలు. ఒక రకంగా కేసీఆర్ ను ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తూ ఉంటాయి.. కానీ అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ఎహే జగన్మోహన్ రెడ్డి మోడీ ముందు మోకరిల్లాడు. అమిత్ షా ముందు మెడలు వంచాడు. బిఎల్ సంతోష్ తో చర్చలు జరిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు మొత్తం ఢిల్లీ ఎదుట తాకట్టు పెట్టాడు.. అన్నట్టుగా రాధాకృష్ణ దెప్పిపొడుస్తాడు. ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని కలిస్తే మరోసారి చారిత్రాత్మక, గుణాత్మక పొత్తుకు మళ్ళీ బీజాలు పడుతున్నాయహో రాసుకుంటూ పోతాడు. జగన్ కలిస్తేనేమో వ్యభిచారం.. చంద్రబాబు భేటీ అయితే సంసారం అన్నట్టుగా పోతురాజు మాదిరి డప్పు కొట్టుకుంటూ చెపుతాడు..

బొక్కలు లేవా

కరెక్టే.. రాధాకృష్ణ రాసినట్టు జగన్ పాలన బాగోలేదు. ఆదాయం అసలు బాగోలేదు. అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. జనాల్లోకి వెళ్లే ధైర్యం జగన్ కు లేదు. పైగా పరదాలూ కట్టుకొని పర్యటన చేస్తున్నాడు. వాస్తవానికి విమర్శ అంటే తప్పును ఎత్తి చూపించేలా ఉండాలి. అంతేగాని ప్రతి విషయాన్ని తప్పు అనేలా ఉండకూడదు. ఆ లెక్కన చూస్తే చంద్రబాబు పాలనలో ఏమంత ఘన కీర్తి ఒనగూరిందని.. రాజధాని కోసం భూములు ఇవ్వనందుకు రైతుల అరటి తోటలు కాలిపోయాయి. ఇసుక అక్రమ రవాణాకు అనుమతులు ఇవ్వబోను అన్నందుకు ఒక మహిళ తహసిల్దార్ పై ఎమ్మెల్యే దాడి చేశాడు.. అసభ్యంగా తాకాడు.. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే ప్రభుత్వ పథకాలు సొంత నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చు.

కేసులు నమోదు కావాల్సిందేనా

ఢిల్లీ లిక్కర్ స్కాం వల్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇబ్బంది పడుతున్నారు. ఆమె వల్ల కెసిఆర్ కూడా ఇబ్బంది పడుతున్నారు.. ఒక రకంగా చెప్పాలంటే కెసిఆర్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ముప్పేట దాడి చేస్తున్నాయి.. ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు. దేనికి దారితీస్తుందో కూడా తెలియదు.. కానీ కెసిఆర్ ని మోడీ ఇబ్బంది పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాపాడుతున్నారు అన్నట్టుగా రాధాకృష్ణ శోకాలు పెడుతున్నారు.. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేసి.. వెంటనే చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని అల్టిమేటం ఇస్తున్నారు. కానీ వైఎస్ఆర్సిపి కి 150 పైచిలుకు శాసనసభ్యుల బలం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు. చంద్రబాబును పొగడవచ్చు. అందులో తప్పులేదు.. అని ఊరంతా ఆయనకు సాగిలపడాలి అని చెప్పడమే తప్పు.. ముమ్మామాటికి తప్పు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version