AB Venkateswara Rao: ఆయన ఉద్యోగం కోసం కూడా అంతగా శ్రమించారో లేదో తెలియదు కానీ.. తిరిగి పోస్టింగ్ పొందేందుకు మాత్రం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ప్రభుత్వం మానసికంగా హింసకు గురిచేసినా వెనుకడుగు వేయలేదు. వెనక్కి తగ్గలేదు. చివరకు అనుకున్నది సాధించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డిపార్టుమెంట్‌కు కమిషనర్‌గా నియమించింది. జెమినీ సినిమా తరహాలో ఆయనను అలా ప్రింటింగ్ – స్టేషనరీ గుట్టల మధ్య సర్వీస్ కొనసాగించాలని సూచించింది. అయితే ఈ పోస్టింగ్ అంతా ఆషామాషీగా ఇవ్వలేదు. రెండేళ్ల పాటు సుదీర్ఘంగా పోరాడి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా రెండు నెలల పాటుఖాళీగా ఉంచారంటే ఆయన పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరోసారి ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి ఢిల్లీకి వెళ్లారని తెలిసిన తర్వాత హడావుడిగా పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత నెల రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మరో నెలకు కూడాపోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మధ్యలో రెండు, మూడు సార్లు సీఎస్‌కు లేఖ రాశారు. సస్పెన్షన్ ఎత్తి వేసినా జీతం.. పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆరోపించారు.ఇలాంటి పరిస్థితుల్లో తప్పని సరిగా పోస్టింగ్ ఇవ్వకపోతే ఇరుక్కుపోతామన్న ఉద్దేశంతో … అధికారులు చివరికి అతి లీస్ట్ లూప్ లైన్ ఉద్యోగం కేటాయించారు.
అభియోగాలివి...
టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగ అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం వచ్చాక సస్పెండ్ చేసింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అయితే కొనుగోళ్లే జరపకుండా అవినీతి ఎలా జరిగిందో చెప్పాలంటూ న్యాయ పోరాటం చేసిన ఏబీవీకి హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ ఊరట లభించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అవినీతి నిరూపించలేక పోయింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తనపై సస్పెన్షన్ ఎత్తి వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీవీ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అనుకున్నది సాధించారు..
ఏది ఏమైనా ఏబీ వెంకటేశ్వరరావు పోరాడి పోస్టింగ్ సాధించుకున్నారు. ఇక ముందు ఎలా ఉంటుందో కానీ ఈ విషయంలో ప్రభుత్వంపై ఆలస్యంగానైనా ఏబీవీ విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అనేక సార్లు తాను ఎవరినీ వదిలి పెట్టబోనని ఆయన చాలెంజ్ కూడా చేశారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లను టార్గెట్ చేసుకుంది. కానీ ప్రభుత్వంతో చాలా మంది సర్దుకుపోయారు. కొంతమంది పక్కా రాష్ట్రాల్లో పోస్టింగులు వేసుకున్నారు. కానీ వెంకటేశ్వరరావు మాత్రం ఏ విషయంలో వెనక్కి తగ్గలేదు. తప్పు చేయనప్పుడు తానెందుకు భయపడాలని భావించిన ఆయన ఏకంగా ప్రభుత్వంపైనే కోర్టను ఆశ్రయించి అనుకున్నది సాధించుకున్నారు.
Also Read:South India sentiment- BJP: మళ్లీ సౌత్ ఇండియా సెంటిమెంట్.. బీజేపీకి గండమే