Satyendar Jain : చైనాలో జైలు శిక్ష విధిస్తే నరకం చూపిస్తారు. సౌదీ అరేబియాలో ఎందుకు బతికి ఉన్నాం రా బాబూ అనే స్థాయిలో శిక్ష విధిస్తారు. అదే మన దగ్గరికి వచ్చేసరికి.. సీన్ మొత్తం రివర్స్.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జైలు శిక్ష కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుంది. ఇవాళ ఉదయం నుంచి ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో తీహార్ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్ర జైన్ గురించి వార్తలతో హోరెత్తిపోయాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న సత్యేంద్ర జైన్ కు అక్కడి అధికారులు రాజభోగాలు అందిస్తున్నారని ఆ వార్తల సారాంశం. అందుకు సంబంధించి వీడియోలు కూడా బయటకు వచ్చాయి.. అసలు ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు, ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీకి సవాల్ విసురుతున్న నేపథ్యంలో కమలనాథులకు సరైన సమయంలో సరైన ఆయుధం లభించినట్లు అయింది. ఇక మనదేశంలో సామాన్యులకు మాత్రమే జైలు శిక్ష కఠినంగా అమలవుతూ ఉంటుంది. సమాజంలో ఒక హోదా, పలుకుబడి ఉన్న వారి లెక్క వేరే విధంగా ఉంటుంది. ఇక రాజకీయ కక్షలకు జైలు శిక్షను ఆయుధంగా వాడుకున్న రాజకీయ నేతలు ఎంతోమంది. అప్పట్లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి హోంశాఖ మంత్రి అమిత్ షాను జైల్లో వేశారు. అక్కడి అధికారులు చుక్కలు చూపించారు. దీని తెర వెనుక సూత్రధారి చిదంబరం అని అందరికీ తెలుసు. తర్వాత కేంద్రంలోకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో చిదంబరాన్ని అమిత్ షా జైల్లో వేయించారు. అప్పుడు తాను అనుభవించిన శిక్షకు బదులు తీర్చుకున్నారు. ఇప్పటికీ రకరకాల కేసులతో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఇక రాజకీయ కక్షల గురించి చెప్పాలంటే ముందు తమిళనాడు రాష్ట్రాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధమే సాగుతూ ఉండేది.

ఎందుకు ఇంత రాజభోగాలు
సాధారణంగా ఒక కేసులో నిందితుడు అని కోర్టులో నిరూపణ అయితే దానికి తగ్గట్టుగా న్యాయస్థానం శిక్ష విధిస్తుంది. కొన్ని కొన్ని సార్లు కేసు తీవ్రత ఆధారంగా జైలు శిక్ష పడుతుంది. మనదేశంలో జైలు శిక్షకు సంబంధించి సామాన్యులకు సమాజంలో పలుకుబడి ఉన్న వారికి వ్యత్యాసం ఉంటుంది. ఇది పలుమార్లు నిరూపితమైంది కూడా. అప్పట్లో పశువుల దాన కేసులో జైలుకు వెళ్లిన లాలు ప్రసాద్ యాదవ్ కు ఇంట్లో ఉన్న సౌకర్యాలే అందులో కల్పించారు. టీవీ, న్యూస్ పేపర్లు, మంచి ఆహారం, ఏసి.. ఇత్యాది సౌలభ్యాలు జైలు అధికారులు సమకూర్చారు. పరిటాల రవి హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన నిందితులు కూడా సకల సౌకర్యాలను పొందారు. అప్పట్లో వారు జైల్లోనే ఫోన్లు మాట్లాడి, సెటిల్మెంట్లు చేసేవారని అపవాదు కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో జైల్లో వారి ఆటలు సాగాయి. ఇందుకు కౌంటర్ గానే జల్సా సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖేష్ రుషి ఇంట్రడక్షన్ సీన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సీన్ ఎండింగ్ లో “మీరు చూస్తున్నది నిజమే. ఇది జైలే. మీకు అనుమానంగా ఉంటే రోజు వార్త పేపర్లు చదవండి అని” కౌంటర్ ఇస్తాడు..
https://twitter.com/javedume/status/1593829527926411265?s=20&t=YttaGxgF3MVNh7DfEjxAKg
సత్యేంద్ర జైన్ విషయంలో..
ఇక తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సత్యేంద్ర జైన్ ఉదంతం కూడా మన దేశంలో కొత్త కాదు. అక్కడిదాకా ఎందుకు ముంబై పేలుళ్ళ కేసులో అరెస్టు అయిన కసబ్ ను ఉరి తీసేంతవరకు బిర్యానీలు పెట్టి మేపారు.. అలాంటి ఉగ్రవాదికే అంతటి సపర్యలు చేసినప్పుడు.. అధికార పార్టీ నేత, అందునా ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడికి సకల మర్యాదలు లభించడంలో ఆశ్చర్యమేముంది. పార్టీకి పదిసార్లు ఆంగ్లేయుల కాలంనాటి చట్టాలను మార్చాలని చెప్పే నరేంద్ర మోడీ.. ఇలాంటి విషయాల్లో ఎందుకు చర్యలు తీసుకోరో అర్థం కాదు. ఇప్పటికే వ్యవస్థలు మొత్తం సామాన్యులకు దూరం జరుగుతున్నాయి. సత్యేంద్ర జైన్ లాంటి వారి ఉదంతాలు చూశాక న్యాయ వ్యవస్థ కూడా ఆ కోవకే వస్తుందనే ఆరోపణలు మరింత నిజమవుతున్నాయి.