మందుబాబులకు ఏపీలోని జగన్ సర్కార్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. లాక్‌డౌన్ తర్వాత ఊహించని స్థాయిలో ధరలు పెంచి అందరినీ భయపెట్టింది. ఆ తర్వాత మద్య నిషేధం కోసం బ్రాండెడ్ లిక్కర్ అమ్మకాలను అడ్డుకుంది. అయితే.. ఇప్పుడు తాజాగా మందుబాబులకు మరో షాక్ ఇచ్చింది. పొరుగు రాష్ట్రాల నుండి మూడు సీసాలు తెచ్చుకోవచ్చనే నిబంధనను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: పోలవరం: టీడీపీ, వైసీపీతో కేంద్రం ఆట!
ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మందుబాబులు ఎప్పుడూ చూడని కొత్త కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. నిజానికి అవన్నీ చాలా చవకబారు మద్యంగా జనాల్లో ప్రచారం ఉంది. అప్పటి వరకు ఉన్న ప్రీమియం బ్రాండ్లలో చాలా వరకు మార్కెట్లో కనబడలేదు. దాంతో మందు బాబుల గోల కూడా ఎక్కువైపోయింది. విచిత్రమేంటంటే జనాలకు కావాల్సిన మందును ప్రభుత్వం సప్లై చేయడం లేదంటూ చంద్రబాబునాయుడు ఏకంగా ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రోడ్డుషోలో ప్రస్తావించారు. ఇక టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు అయితే మద్యం బ్రాండ్లపై ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టి బాధపడ్డారో చెప్పలేం.
సరే ఎవరేమనుకున్నా ప్రభుత్వ ఆలోచనల్లో మాత్రం మార్పురాలేదు. దాంతో పొరుగు రాష్ట్రాల నుంచి తమకు కావాల్సిన మద్యాన్ని కొందరు తెచ్చుకుంటూనే ఉన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి డంప్ చేస్తున్నారు. అయితే.. దిగుమతి చేస్తున్న వారిని పట్టుకోగా ప్రభుత్వానికి కోర్టు నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఎక్సైజ్ చట్టం ప్రకారం సొంత వాడకానికి మూడు బాటిళ్లు తెచ్చుకోవచ్చని చెప్పింది. ఆ నిబంధన ప్రకారం ఎవరిపైనా కేసు పెట్టేందుకు వీలు లేదని తీర్పు చెప్పారు.
Also Read: యాక్టివ్ రోల్‌లోకి కొండా దంపతులు! ఏం చేస్తారు?
దీంతో జగన్ సర్కార్ వెంటనే ఎక్సైజ్ పాలసీలో మార్పులు తెచ్చింది. కొత్త పాలసీలో భాగంగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు బాటిళ్లు తెచ్చుకోవడం కూడా నేరమే. అందుకే.. ఇక నుంచి ఎవరి దగ్గర మద్యం బాటిళ్లు దొరికినా వారిని వెంటనే అరెస్టు చేసే అధికారం పోలీసులకు, ఎక్సైజ్ పోలీసులకు ఇచ్చింది. మరి దీనిపై ఎంత మంది కోర్టును ఆశ్రయిస్తారో.. కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో చూడాలి.