Sumithra Devi : కొన్ని కథలు విన్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ ఓ పట్టాన నమ్మేట్టుగా ఉండవు. కానీ నిజాలు అలా కాదు. ఎవరినీ ఎవరూ తేలికగా తీసిపారేయకూడదు అనే నీతిని బలంగా చెబుతాయి. ఇంగ్లిష్‌లో ఓ సామెత కూడా ఉంది. ఒక చెట్టుతో లక్ష అగ్గి పుల్లలు తయారు చేయవచ్చు… కానీ ఒక్క అగ్గిపుల్లతో లక్ష చెట్లను కాల్చేయొచ్చు. అంటిని నిజమైన ఘటన ఇది. ఓ తల్లి శ్రమైక జీవన సౌందర్యం. ఇటీవల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెల్లెలి లైఫ్‌స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్న సీఎం అయినా.. చెల్లెలు పూరి గుడిసెలో జీవించడం నిజంగా గొప్ప విషయం. యోగి కూడా తన చెల్లిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు కూడా. అయితే అంతకంటే గొప్ప కథనం ఇదీ..
ఓ స్వీపర్..
సుమిత్రాదేవి.. ఓ స్వీపర్. జార్ఖండ్, రాజరప్పలోని సీసీఎల్ టౌన్‌షిప్ వీధులను 30 ఏళ్లుగా ఊడుస్తోంది. రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది. నిజానికి ఓ స్వీపర్ రిటైరయిపోతే ఆఫీసు పెద్దగా పట్టించుకోదు. ఆ వివక్ష ఇప్పటికీ ఉంది. కానీ సుమిత్రాదేవి రిటైర్మెంట్ గొప్పగా జరిగింది. గొప్ప అంటే గుర్తుంచుకునేంతం అందరూ తమ పిల్లలకు ఈ నీతికథ చెప్పేంత. ఆత్మన్యూనత వద్దు అని అందరికీ చాటి చెప్పేంత గొప్పగా ఆమె పదవీ విరమణ రోజును ఆమె సహచరులు, పొరుగు వారు వీడ్కోలు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు చూస్తే ఓ సగటు నాలుగో తరగతి ఉద్యోగికి సాదాసీదా వీడ్కోలు చెబుతున్నట్టే ఉంది.
మూడు కార్ల రాకతో మారిన సీన్..
కానీ అక్కడికి మూడు కార్లు వచ్చేసరికి ఆ సీన్ మొత్తం మారిపోయింది. అక్కడంతా ఓ ఆశ్చర్య వాతావరణం అలుముకుంది. మొదట వచ్చింది ఓ నీలం రంగు కారు. అది బీహార్‌లోని సివాన్ జిల్లా కలెక్టర్ కారు. ఆ కలెక్టర్ చేతులు ఆ స్వీపర్ పాదాల్ని తాకాయి. ఈలోపు మరో రెండు కార్లు వచ్చాయి. వాటిల్లో నుంచి దిగిన మరో ఇద్దరు కూడా సేమ్ ఆ కలెక్టర్‌లాగే ఆమె పాదాల్ని తాకారు. ఆ ముగ్గురూ ఎవరో తెలుసా..? ఈ స్వీపర్ సుమిత్రాదేవి కొడుకులు. ఆమె పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్ రైల్వేలో ఇంజనీర్. రెండవ కుమారుడు ధీరేంద్ర కుమార్ డాక్టర్. మూడవ కుమారుడు మహేంద్ర కుమార్ ఇప్పుడు బీహార్‌లోని సివాన్ జిల్లా కలెక్టర్. ముగ్గురు కొడుకులూ ఆమె పాదాలను తాకడంతో సుమిత్ర ఏడవసాగింది. ఆఖరి రోజున ఆమెను సత్కరించేందుకు అక్కడికి చేరుకున్న ఆమె ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి లోనవుతుండగా ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది. కానీ అవి కన్నీళ్లు కావు, ఆనందాశ్రువులు.
ఎక్కడా గర్వం లేకుండా..
ఈ సత్కారం సందర్భంగా సుమిత్రాదేవి.. మాట్లాడుతూ ‘సార్, 30 ఏళ్లుగా నేను ఈ కాలనీ వీధులు ఊడుస్తున్నాను. నా పిల్లలు కూడా మీలాంటి పెద్ద సార్లే’ అని అక్కడికి వచ్చిన ఉన్నతాధికారులకు తన పిల్లల్ని పరిచయం చేసింది. కానీ ఆమె ముఖంలో ఎక్కడా గర్వం కనిపించలేదు. ఎదిగినా ఓదిగే ఉండాలన్నట్లు వినమ్రపూర్వకంగా సుమిత్రాదేవి తన పిల్లల గురించి తన పై అధికారులకు చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఇక కలెక్టర్ కొడుకు మాట్లాడుతూ ‘మా అమ్మ మా కోసం చాలా త్యాగం చేసింది. ఆమె మమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు. ఎప్పుడూ కష్టపడి చదవమని మమ్మల్ని ప్రోత్సహించేది.., ఏదైనా ఒక రోజు ఇలాంటి ఆఫీసులలో ఆఫీసర్లుగా ఉండగలం అని చెప్పేది. ఆమె నా తల్లి అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను’
ఎదిగినా ఒదిగి ఉండడం..
ఈ కథనంలో విశేషం ఏమిటంటే కొడుకులు భిన్నరంగాల్లో పెద్దగా ఎదిగినా సరే, ఆమె తన వృత్తిని మానుకోలేదు. వీధులు ఊడుస్తూనే ఉంది. తన కొలువు, తన గౌరవం కొడుకులు మంచి పొజిషన్లకు చేరుకున్నాక నిజానికి ఆమె వృత్తి నిబద్ధత మరింత పెరిగింది. ‘‘నా పిల్లలు రాణిస్తున్నప్పటికీ నేను ఈ ఉద్యోగాన్ని వదల్లేదు. ఎందుకంటే నా పిల్లలను చదివించడానికి ఈ ఉద్యోగం ఉపయోగపడింది. నా కలలను నిజం చేసినదాన్ని నేను ఎలా వదిలివేయగలను..’ అని చెమర్చిన కళ్లతో సుమిత్రాదేవి చెప్పడం ఆమె శ్రమైక జీవన సౌందర్యాన్ని. వృత్తిపై ఉన్న గౌరవాన్ని ఆవిష్కరించింది.
పిల్లలూ గ్రేటే..
ఇక సుమిత్రాదేవి కడుపున పుట్టిన ఆ పిల్లలు కూడా చాలా గ్రేట్. తమ తల్లి ఒక స్వీపర్ అని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. చాలామంది పిల్లలకు వాళ్లు ఆదర్శం. అంతేకాదు, అంతమందిలో బహిరంగంగా తల్లి పాదాల్ని తాకి ఉద్వేగానికి గురయ్యారు. ‘జీవితంలో ఏ ఉద్యోగమూ కష్టం కాదు. చిన్నతనం కానేకాదు. నిజాయుతీతో కూడిన కృషితోనే ప్రతిదీ సాధ్యమవుతుంది. మా అమ్మ, మేం మా జీవితంలో చాలా కష్టమైన దశల్ని అనుభవించాం, ఐనా సరే మమ్మల్ని తను ఎప్పుడూ నిరాశకు గురిచేయలేదు. ఆమె అంచనాలకు అనుగుణంగా జీవిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం’ అన్నాడు ఆ కలెక్టర్.. అసలు ఇది కదా స్ఫూర్తిదాయక కథనం.