https://oktelugu.com/

AP Roads: కడపకు 32.. శ్రీకాకుళానికి 1.. రోడ్ల మంజూరు తీరిది

ఏపీలో రోడ్లు గురించి ఎంత చెప్పినా తక్కువే. గోతులు తేలిన రహదారులపై ప్రయాణించే వారిలో జగన్ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టినోళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ జగన్ సర్కార్ ఇవేవీ పట్టించుకోవడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : November 17, 2023 / 05:37 PM IST

    AP Roads

    Follow us on

    AP Roads: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రహదారులు పట్టుకొమ్మలు. రవాణా వ్యవస్థ మెరుగుపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినట్టు. కానీ ఇప్పుడు ఏపీలో అడుగేస్తే మడుగే అనేలా పరిస్థితి మారింది. గోతుల్లో రహదారులు వెతుక్కోవలసిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా గడువులు విధించడం.. గడువులు దాటిపోవడం పరిపాటిగా మారింది. రోడ్ల పరిస్థితి మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రాష్ట్రంలో 115 రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలపై వివక్ష చూపడం విమర్శలకు తావిస్తోంది.

    ఏపీలో రోడ్లు గురించి ఎంత చెప్పినా తక్కువే. గోతులు తేలిన రహదారులపై ప్రయాణించే వారిలో జగన్ ప్రభుత్వాన్ని శాపనార్ధాలు పెట్టినోళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ జగన్ సర్కార్ ఇవేవీ పట్టించుకోవడం లేదు. తమకు నచ్చిన రీతిలో ముందుకు సాగుతోంది.రోడ్ల మంజూరు, మరమత్తులు విషయంలో సైతం తన మార్కు రాజకీయం చూపుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. రాష్ట్రంలో 115 రోడ్లను ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద పక్కా రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రోడ్లు కేటాయించాల్సి ఉండగా.. సీఎం జగన్ తో పాటు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలకు పెద్దపీట వేయడం విశేషం.

    ఏపీకి మొత్తం 115 రహదారులు మంజూరయ్యాయి. అందులో సీఎం జగన్ సొంత జిల్లా కడపకు 35 రహదారులను కేటాయించారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు 15 రహదారులు కేటాయించారు. మిగతా రహదారులను.. మిగిలిన జిల్లాలకు సర్దేశారు. కానీ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు కేటాయించింది 8 రహదారులే.ఇందులో శ్రీకాకుళం జిల్లాకు ఒకే ఒక రహదారిని పరిమితం చేశారు. విశాఖ జిల్లాకు రెండు రహదారులను కేటాయించారు. విజయనగరం జిల్లాకు మాత్రం ఐదు రహదారులను కేటాయించి పర్వాలేదనిపించుకున్నారు. అయితే జగన్, పెద్దిరెడ్డిల సొంత జిల్లాలోని రోడ్లు పాడయ్యాయా? కేంద్రం కేటాయించిన రహదారుల పనులు వీరు జిల్లాల కేనా? మిగతా జిల్లాలను పరిగణలోకి తీసుకోరా? అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర పై వివక్ష చూపడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ హయాంలో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు ఆర్భాటపు ప్రకటనలు చేస్తుంటారు. అటువంటి వారు ఎక్కడికి వెళ్లారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.