YCP: వైసీపీలో వారసత్వ గొడవ ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టిక్కెట్ ఇవ్వాలని నేతలు పట్టుబడుతున్నారు. దాదాపు పార్టీలో సీనియర్లు అందరూ ఇదే కోరికను వెలిబుచ్చుతున్నారు. కానీ హై కమాండ్ నుంచి ఆ స్థాయిలో భరోసా దక్కడం లేదు. ఇటువంటి వారంతా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తప్పుకుంటామని.. తమ కుమారులకు టిక్కెట్లు ఇవ్వాలని గట్టిగానే కోరుతున్నారు. వారికి ఏం చెప్పాలో తెలియక సజ్జల సతమతమవుతున్నారు.
వైసీపీలో సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఇందులో రాజశేఖర్ రెడ్డికి సమకాలీకులు సైతం ఉండడం విశేషం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్ర స్వామి, తమ్మినేని సీతారాం, చెన్నకేశవరెడ్డి, శెట్టిపల్లి రఘునాథ్ రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఉన్నారు. వీరంతా ఏడు పదుల వయసుకు సమీపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తా ము పక్కకు తప్పుకొని వారసులకు లైన్ క్లియర్ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ కు చెబితే ఆయన ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానాల నుంచి పాతవారే రంగంలోకి దిగాలని సూచిస్తున్నట్లు సమాచారం. అభ్యర్థిని మార్చితే లేనిపోని ఇబ్బందులు వస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఓ ముగ్గురి నేతల విషయంలో జగన్ మినహాయింపు ఇచ్చారు. మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు కి టికెట్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి టికెట్లు ప్రకటించారు. ఎప్పుడైతే మూడు నియోజకవర్గాల వారసులకు పార్టీ టికెట్లు ప్రకటించిందో మిగతా నాయకులు సైతం క్యూ కడుతున్నారు. తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. దీంతో ఈ పరిణామం వైసీపీలో కొత్త దుమారానికి దారితీసింది.
వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇస్తే గెలిపించుకునే బాధ్యత తమదేనని సీనియర్లు చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం ఆ మాటలను విశ్వసించడం లేదు. టికెట్ ను మార్చితే లేనిపోని సమస్యలు వస్తాయని.. లోకల్ క్యాడర్ అంతగా సహకరించదని.. వారసత్వ రాజకీయాలపై ప్రజల్లో లేనిపోని అపోహలు క్రియేట్ అవుతాయని జగన్ భయపడుతున్నారు. సీనియర్లు మాత్రం తామ ప్రభావం ఉన్న సమయంలోనే పిల్లలను పొలిటికల్ గా సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ పరిణామాలన్నీ వైసీపీ సీనియర్లకు రుచించడం లేదు. అయితే ఈ అంశం ఏటు తిరుగుతుందోనన్న బెడద వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.