Padmavathi Hrudayalayam: జగన్ సర్కార్ ప్రచార ఆర్భాటానికి అంతే లేకుండా పోతోంది. చివరకు టీటీడీ నిధులతో ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతులు కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు. తన ప్రభుత్వమే ఇవన్నీ చేస్తోందని చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో వైసిపి అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. మరీ ముఖ్యంగా సాక్షిలో వచ్చిన కథనం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం జగన్ మానస పుత్రిక అంటూ సాక్షిలో వచ్చిన ప్రత్యేక కథనం చర్చనీయాంశంగా మారింది. ఆ ఆసుపత్రి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుండగా.. జగనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు ఈ ప్రత్యేక కథనం ఉంది. దీంతో ఇన్నాళ్లు ఆ హృదయాలయం అందించిన వైద్య సేవలు ఏవీ లేనట్టు? అవన్నీ జగనే కల్పించినట్లు ఓ ప్రచారానికి తెరలేపింది వైసిపి సోషల్ మీడియా.
పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దశాబ్దల కాలం కిందట దీనిని నిర్మించారు. మెరుగైన వైద్య సేవలు అందించేవారు. చిన్నపిల్లల గుండె వ్యాధులకు సంబంధించి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందేవి. 2004 నుంచి ఇక్కడ సేవలు అందుతున్నట్లు తెలుస్తోంది. 2021 సెప్టెంబర్ లో కార్డియాక్ కేర్ సెంటర్ ను జగన్ ప్రారంభించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడంతో వైద్య చికిత్సలు కొంచెం ఎక్కువయ్యాయి. అయితే అది జగన్ పుణ్యమే అంటూ వైసిపి అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. దశాబ్దాలుగా అక్కడ పిల్లల గుండె చికిత్సలకు సంబంధించి వైద్య సేవలు అందుతున్నాయి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే దానిని ప్రారంభించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు రోజుల కిందట నెల్లూరు జిల్లాకు చెందిన ఓ చిన్నారి గుండె మార్పిడి చికిత్స పూర్తి చేశారు. అప్పటినుంచి ఇదంతా జగన్ క్రెడిట్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఆరోగ్యశ్రీ లేకున్నా మందులు ఖర్చులు భరిస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుష్కలంగా నిధులు సమకూర్చడంతో పాటు దాతలు సైతం నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఆరోగ్యశ్రీ వల్లే ఇక్కడ ఉచిత వైద్య సేవలు అందుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇందులో ఎంత నిజం లేదని.. దశాబ్దాలుగా టీటీడీ ఈ హృదయాలయం ద్వారా ఎంతోమంది చిన్నారులకు గుండెలు సమకూర్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఉన్న సంగతి తెలిసిందే. నాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఈ ఆసుపత్రి సేవలు బాగానే అందుతున్నాయి. ఆసుపత్రి చైర్మన్ గా నందమూరి బాలకృష్ణ ఉన్నారు. అయితే దీనిపై ఎన్నడూ రాజకీయ ముద్ర పడలేదు. కనీసం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రచారం చేసుకోలేదు. కానీ జగన్ ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పద్మావతి హృదయాలయాన్ని తన ప్రచారానికి వాడుకోవడం విమర్శలకు దారితీస్తోంది.