Aryavyas: ఏపీలో ఆర్యవైశ్యులకు ఇటీవల కాలంలో వరుస అవమానాలు జరుగుతున్నాయి. నిన్నటి నిన్న ఆర్యవైశ్యులంతా పెద్దాయనగా భావించే మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ రోశయ్యకు ఏపీ ప్రభుత్వం కనీస మార్యద ఇవ్వకపోవడం ఆవర్గంలో నైరాశ్యాన్ని నింపింది. ఈ ఘటన మరుకముందే వైసీపీకి చెందిన ఆర్యవైశ్య నాయకుడు సుబ్బారావుపై ఆపార్టీ నేతలే భౌతికదాడులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.

ఆర్యవైశ్యులకు వరుస అవమానాలు జరుగుతుండటాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. కిందటి ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైసీపీకి మద్దతుగా నిలిచారు. వీరి అండతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తమను చులకనగా చూస్తున్నారని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఈనేపథ్యంలో భవిష్యత్ కార్యచరణకు వారంతా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఆర్యవైశ్యులు ఆర్థికంగా బలవంతులు కాకపోయినప్పటికీ సామాజిక పరంగా చాలా గౌరవంతో బతుకుంటున్నారు. ఎవరి జోలికి వెళ్లకుండా తమ వృతి, వ్యాపారాలను చేసుకునే మనస్తత్వం కలిగిన వారు. అన్ని పార్టీల్లోనూ ఆర్యవైశ్యులున్నారు. అయితే ఆర్యవైశ్యులకు జరుగుతున్న అవమానాలపై మాత్రం నేతలెవరు కూడా నోరుమెదపడం లేదు.
ఈక్రమంలోనే పార్టీలకు అతీతంగా ఉన్న ఆర్యవైశ్యులంతా తమ వాదనలు విన్పించేందుకు రెడీ అవుతున్నారు. ఎవరి జోలికి వెళ్లని తమకు ప్రభుత్వం నుంచి అవమానాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం రోశయ్యకు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కనీసం సంతాపం కూడా తెలియజేయకపోవడాన్ని ఆర్యవైశ్యులు తప్పుబడుతున్నారు.
అలాగే వైసీపీకి చెందిన సుబ్బారావు నీతినిజాయితీ వ్యాపారం చేసుకుంటూ పార్టీ కోసం పని చేస్తున్నాడు. ఎదుటి వారికి సాయం చేస్తూ దందాలకు దూరంగా ఉండే వ్యక్తి. అలాంటి సుబ్బారావుపై వైసీపీకి చెందిన మంత్రి అనుచరులే భౌతిక దాడికి యత్నించడంపై ఆర్యవైశ్యులు మండిపడుతున్నారు.
Also Read: మద్యపాన నిషేధంపై జగన్ మడమ తిప్పేస్తాడా..?
ఆర్యవైశ్యులపై ఓ పథకం ప్రకారంగానే ఏపీలో దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు వారంతా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నేతలు నోరుమెదకపోయినా పార్టీలతో సంబంధంలేని ఆర్యవైశ్యులు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ర్యాలీలతో నిరసన గళం విన్పిస్తున్నారు. ఇన్నాళ్లు వైసీపీకి మద్దతు ఉన్న ఆర్యవైశ్యులు ప్రభుత్వం తీరుతో క్రమంగా దూరమవుతున్నారు.
జగన్ సర్కారు వీరి విషయంలో ముందస్తుగా మేల్కొనకుంటే ఆపార్టీకి భారీగా నష్టం జరిగే అవకాశం కన్పిస్తోంది. అయి తే ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే వారి వ్యాపారాలన్నీ ఉండటంతో ఈ వ్యవహరాన్ని వారంతా లైట్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఇలాంటి ఇష్యూలు మున్ముందు కొనసాగిస్తే మాత్రం వైసీపీ గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.