https://oktelugu.com/

Palakkad : ఆయనో రైల్వే ఉద్యోగి.. రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు.. ఇప్పుడది టూరిస్ట్ స్పాట్ అయింది.. ఎందుకంటే..

ఇలాంటి వారి వల్లే రైల్వే శాఖ ఇంకా గొప్పగా వర్ధిల్లుతోంది. మరింత మెరుగైన సేవలు అందించగలుగుతోందని" పలువురు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 18, 2024 / 07:12 AM IST

    A retired railway employee in Palakkad has a wall like a train

    Follow us on

    Palakkad: అది కేరళ రాష్ట్రం. పాలక్కాడ్ ప్రాంతం. సహజంగానే ఆ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. చుట్టుకొబ్బరి తోటలు, రబ్బర్ తోటలు, కాఫీ తోటలు, తేయాకు తోటలతో ఆ ప్రాంతం పచ్చదనంతో అలరారుతూ ఉంటుంది. పైగా పాలక్కాడ్ లో విస్తారంగా చిట్టి ముత్యాల రకం వరి పండుతుంది. ఈ రకమైన ధాన్యం కోసం ఎక్కడెక్కడ నుంచో వ్యాపారులు వస్తూ ఉంటారు. అంతేకాదు విస్తారంగా లభించే చేపలు ఈ ప్రాంతానికి మరొక ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాంతం లో చూడాల్సిన టూరిస్ట్ ఏరియాలు చాలా ఉంటాయి. అయితే వీటితోపాటు రైల్వే శాఖలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఇల్లు కూడా ఇప్పుడు టూరిస్ట్ స్పాట్ అయిపోయింది.

    రైల్వే శాఖలో పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పనిచేశాడు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ ఉత్తమమైన ఉద్యోగిగా పేరుపొందాడు. చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే అసిస్టెంట్ మేనేజర్ దాకా రైల్వే శాఖతో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.. అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ హోదాలో ఉద్యోగ విరమణ చేశాడు. ఉద్యోగ విరమణ అనంతరం రైల్వే శాఖ అతడికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసింది. ఆ బెనిఫిట్స్ తాలూకు నగదును అతని ఖాతాలో జమ చేసింది. సుదీర్ఘకాలం రైల్వే శాఖలో పనిచేయడం, సొంత ఊరికి దూరంగా ఉండటంతో అతనికి ఏదో కోల్పోయిన బాధ ఉండేది. పదవి విరమణ చేసిన తర్వాత సొంత ప్రాంతమైన పాలక్కాడ్ వెళ్లిపోయాడు. పిల్లలు ఇతర ప్రాంతాల్లో స్థిరపడటంతో.. తనకు వంశపారంపర్యంగా వచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు.. తన భార్య తో ఉండటం మొదలుపెట్టాడు.

    తాను ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో చుట్టూ ప్రహరీని విభిన్నంగా రూపొందించాడు ఆ వ్యక్తి. ఆ ప్రహరీకి రైల్వే బోగీల మాదిరి రంగులు వేయించాడు. అవి ఎలా ఉంటాయో.. అచ్చం అలానే రూపొందించాడు. దూరం నుంచి చూస్తే రైల్వే బోగీలు రోడ్డు మీదకు వచ్చినట్టు కనిపిస్తుంది.. దగ్గరికి వెళ్తే గాని అసలు చిత్రం అర్థం కాదు. ఈ ప్రహరీ నిర్మాణాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు. అంతేకాదు అతడి నిర్మాణ శైలిని మెచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు రైల్వే శాఖలో పనిచేసినందుకు.. దానిపై అభిమానాన్ని ఇలా చూపినందుకు అతడిని కొనియాడుతున్నారు. “ఆయన ప్రహరీ నిర్మించుకున్న విధానం బాగుంది. దానిని రూపొందించిన విధానం ఇంకా బాగుంది. రంగులు చూస్తుంటే నిజంగా రైల్వే బోగీల లాగా ఉన్నాయి. పనిచేసిన సంస్థ పై మమకారం పెంచుకోవడం అంటే ఇదే కాబోలు. ఇలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం సంస్థలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటివారు తమ పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆ సంస్థకు మరింత గౌరవాన్ని తెచ్చి పెడతారు. ఇలాంటి వారి వల్లే రైల్వే శాఖ ఇంకా గొప్పగా వర్ధిల్లుతోంది. మరింత మెరుగైన సేవలు అందించగలుగుతోందని” పలువురు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.