Raja Narsagoud: నిజామాబాద్ జిల్లాలో 1866లో సంపన్న కుటుంబంలో జన్మించిన వ్యక్తి తన దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలతో దానకర్ణుడిగా, రాజా బిరుదాంకితుడిగా గుర్తింపు పొందాడు. ఆయన సేవలకు నిజాం నవాబుసైతం ఫిదా అయ్యాడు. ‘రాజా’ బిరుదు ప్రదానం చేశారు. కానీ చాలా మందికి ఈ దానకర్ణుడి గురించి తెలియదు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకుందాం.
వ్యాపారంతో సంపన్నులుగా…
నిజామాబాద్ జిల్లాలో 1866లో జన్మించాడు నర్సాగౌడ్. ఆయన తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో ఇతడు చివరివాడు. ఇతని అన్నలు రామాగౌడ్, లక్ష్మాగౌడ్ తమ కుటుంబ వ్యాపారమైన ఎక్సైజ్ వ్యాపారం నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూవుండేవారు. నర్సాగౌడ్ నిజామాబాదులో ఉంటూ వ్యాపార లావాదేవీలు చూసుకునేవాడు. ఈ ముగ్గురు సోదరులూ తమ వ్యాపారాన్ని విస్తరించి హైదరాబాద్ స్టేట్‌లో అత్యంత ధనిక కుటుంబాలలో ఒకరుగా ఎదిగారు. ఇతని మనుమరాలు బొమ్మ హేమాదేవి నవలా రచయిత్రిగా ప్రసిద్ధురాలు. మరొక మనుమరాలు ఆర్.అఖిలేశ్వరి తొలితరపు మహిళా జర్నలిస్టుగా ప్రసిద్ధి పొందింది.
Also Read: Pawan Kalyan On Secularism: అవకాశవాద సెక్యూలరిస్టులూ , పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి
సేవాకార్యక్రమాలు
నర్సాగౌడ్ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సమాజసేవ చేయడంలో కూడా ఆసక్తిని కనబర్చాడు. దానధర్మాలు చేసినప్పుడు కులమతాల వివక్షతను పాటించలేదు. ఇతడు గుళ్లు, మసీదులు, దర్గాల నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసహాయం చేశాడు. నిజామాబాదులోని కొత్తగల్లీలోను, కంఠేశ్వర్‌లోను బీదవారికి, బ్రాహ్మణులకు ధర్మసత్రాలను కట్టించాడు. నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, పలు అధ్యాత్మిక క్షేత్రాలను నిర్మాణం, పునరుద్ధరణకు కృషి చేశాడు. జిల్లాకేంద్రమైన నిజామాబాదులో మొదటి నీటిట్యాంకు నిర్మాణం, నల్లాలు బిగించుటకు సిర్నపల్లి సంస్థానాధీశురాలు చీలం జానకీబాయి సహకారంతో ఆర్థిక సహకారం అందించాడు. నిజాం పాలనలో సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సమయంలో టౌన్ హాల్‌ను నిర్మింపజేశాడు. ఇంకా శంభునిగుడి, నీలకంఠేశ్వరాలయం, సీఎస్‌ఐ చర్చి, మసీదుల నిర్మాణం, పునరుద్ధరణకు సహకారం అందించాడు. డిచ్‌పల్లిలో 30 ఎకరాల భూమిని క్రిస్టియన్ మిషనరీలకు కుష్ఠు నివారణ కేంద్రం స్థాపించడానికి దానం చేశాడు. ఇనిస్టిట్యూషనల్ కేర్ గివింగ్ హాస్పిటల్‌గా ప్రారంభమైన ఈ ఆసుపత్రి భారతదేశంలోనే మొట్టమొదటిది. 1937లో నిజామాబాదులో జరిగిన ఆరో ఆంధ్ర మహాసభల సందర్భంగా వేలాదిమందికి భోజన ఏర్పాట్లు చేశాడు. నిజామాబాద్ – మంచిర్యాలకు రహదారి వెంట కొన్ని మైళ్లకు ఒక బావి చొప్పున తవ్వించి ప్రయాణీకుల దాహం తీర్చాడు. ఇల్లు లేని పేదవారికి కంఠేశ్వర్, విమ్రి గ్రామాల్లో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చాడు. యేటా బీదవారికి చలికాలం ప్రారంభమైయ్యే సమయానికి గొంగళ్లు, చెప్పులు పంచేవాడు. వేసవి కాలంలో బీదవారికి అంబలి ఇచ్చేవాడు.
విద్య, వైద్యానికి నాడే ప్రాధాన్యం..
నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి కారకుడయ్యాడు నర్సాగౌడ్. ఇతనికి విద్యపట్ల నమ్మకం ఉండేది. ఇతడు అనేక మంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయపడ్డాడు. ఇతని తోడ్పాటుతో చదువుకున్న అనేకులు ఇంజనీర్లు, డాక్టర్లు, జడ్జీలు, లోక్‌సభ సభ్యునిగా కూడా ఎదిగారు. వీరిలో అన్ని కులాలకు సంబంధించిన వారున్నారు. ఇతని సహాయంతో చదివి ఇంజనీర్ అయిన నారాయణగౌడ్‌కు తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేశాడు. నిజామాబాదులో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటుకు నర్సాగౌడే కారకుడు. ఆయన నివాసం ఉన్న ప్రాంతాన్ని నర్సాగౌడ్ కాలనీగా పిలుస్తున్నారు.
సన్మానాలు, బిరుదులు, గుర్తింపులు
ఎన్ని దానధర్మాలు చేసినా వాటిని ప్రచారం చేసుకోవడం నర్సాగౌడ్‌కు ఇష్టం ఉండేది కాదు. ఒకసారి ఆయన ఏకైక కుమారుడు రామాగౌడ్ ఇతనికి తెలియకుండా ప్రసూతి ఆసుపత్రిలో.. దానిని నిర్మించింది నర్సాగౌడ్ అని తెలిపే శిలాఫలకం ఏర్పాటు చేయించాడు. నర్సాగౌడ్ ఈ విషయం తెలిసిన వెంటనే దానిని తొలగింపజేశాడు. అతి కష్టంమీద ఏడో నిజాం ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రదానం చేసిన ‘రాజా‘ అనే బిరుదును అంగీకరించాడు. 1930లో ఐదవ కింగ్ జార్జ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇతడు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా ఒక పతకాన్ని బహూకరించి సత్కరించాడు.
1948లో మరణం..
1948, ఏప్రిల్ 4వ తేదీన తన 82వ యేట నర్సాగౌడ్ మరణించాడు. ఆ సమయంలో హైదరాబాదు స్టేట్‌లో రజాకార్ల ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది. హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు, భయాందోళనలు పెచ్చిల్లుతున్న కాలమది. నర్సాగౌడ్ పార్థివదేహాన్ని శ్మశానానికి తీసుకు వెళ్లడానికి సంశయిస్తున్నారు. కారణం స్మశానానికి వెళ్లడానికి ముస్లింల ఇళ్లను దాటాలి. అదొకటే మార్గం ఉంది. ఆ దారిలో వెళితే ఏం జరుగుతుందో అని భయపడ్డారు. కాని గత్యంతరం లేక అదే దారిలో వెళ్లాల్సి వచ్చింది. అయితే వారు భయపడినట్లు కాక దారిలో ముస్లీంలు నర్సాగౌడ్ శవానికి ఎదురువెళ్లి వారు కూడా ఆ శవాన్ని శ్మశానం వరకూ మోసుకువెళ్లారు. నర్సాగౌడ్‌పై ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా అభిమాన గౌరవాలు ఉన్నాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
Also Read:YCP To Janasena : వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు.. ఇదే ఊపు కంటిన్యూ అవుతుందా?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: A resident of nizamabad who was admired by the nizam apara danakarna narsagoud
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com