
కండ్ల ముందటనే సాటి మనుషులు ఆకలికి అంగలారుస్తృండ్రు. వందల మైళ్ళు నడిచి నడిచి కాళ్ళు కమిలి పోయి రక్తాలు గారుతున్నై.బుడ్డ పోరలు పాలకు ఏడుస్తున్నరు. నడుద్దాం అనుకున్నా లేత పాదాలకు రోడ్డు మీది డాంబర్ అంటుకోని బొబ్బలెక్కి రోసలు గారుతున్నై. ఉన్న చోట పెద్దోళ్ళకు పనిలేదు, చిన్నోళ్ళకు బువ్వలేదు. ఇద్దరికీ అన్నం బెట్టి ఆదుకునే నాథుడు లేదు. కన్నూరుకు వోదామంటే కాలి నడుక దప్ప మరో మార్గం లేదు. సర్కార్ల కు దయలేదు. కేవలం 4 గంటల వ్యవధిలోనే లాక్ డౌన్ ప్రకటించిండ్రు. వాళ్ళు ఎల్లిపోకటకు దార్లు మూసిన సర్కారు, వాళ్ళకు నిలువ నీడ , ఆకలికి అన్నం సంగతి ఎట్లా అని ఆలోచన చేయలేదు. ఎల్లిపోండ్రని పోలీసోళ్లను వెట్టి తరుముతున్నది. గోడు గోడు నా ఏడుసుకుంటా ఆదేశ్ రవి పాడిన పాట తీరుగా పిల్ల జెల్ల లను మోసుకుంటా నడిసి పోతున్నరు.
ఎంతో ఆపసోపాలు వడ్డ సర్కారు ఆఖరులు లచ్చ మందిని వాళ్ళ శ్రామిక రైళ్ళ ద్వారా ఇండ్లకు చేర్చినమ్ అని గొప్పగ చెప్పుకుంటున్నది. 20 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని వాళ్ళే చెప్పిండ్రు. దాంట్లే, వాళ్ళు సాయపడ్డది కేవలం 5% శాతం మందికే అని వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పుతుండ్రు . అట్లనే ఎంతో గొప్పగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో కూడా వాళ్ళు నిజంగా ఖర్చు చేద్దాం అనుకుంటే కూడా ప్రజలకోసం చేసేది, చెయ్యగలిగింది గూడా గదె 5% శాతమేనట.
సర్కారుకు నిజంగా చిత్త శుద్ది ఉంటే సుశిక్షితులు అయిన మిలిటరీ బలగాలు ఉన్నయి. వాళ్ళ వెంట లెక్కకు మించిన మిలిట్రీ వాహనాలు ఉన్నయి. సర్కారు ఒక్క ఆర్డర్ పాస్ చేస్తే ఎప్పుడో వలస కూలీలను సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇండ్లల్ల ఇప్పటికే వాళ్ళు దించి వచ్చే వాళ్ళు. ఉత్త పున్న్యానికి మిలిట్రీ విమానాలతోటి దేశమంతా పూలు జల్లి పిచ్చి కోట్లాది రూపాయలు బూడిది పాలు జెస్తిరి. సాటి మనుషులు ఆకలి మంట తోటి , ఎండలకు పెయ్యంత సెముట తోటి అట్టలు గట్టంగా అంగలార్సుకుంట వొతుంటే, వాళ్ళ పిల్లల లేత చెక్కిల్ల మీద కన్నీటి సారలు సెముట దారళ్ళ కలిసి కండ్లు మూతలు వడంగ నడుస్తుంటే, రాజ్యాంగం మీద ప్రమాణం జెసి ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్బాలు పలికి గెద్దెనెక్కిన పెద్దలకు ఏమీ అనిపించడం లేదా? నాకైతే ఇసొంటి కాలం ల ఇంకా బతికున్నందుకు పెయ్యంత లావు సిగ్గైతాంది.
నాలుగైదు రోజుల సంది 20 లచ్చెల కోట్ల గురించి ఎందేందో సెప్పుతా ఉంటే , దాంట్లే ఈ వలస జీవులకు ఊరట గలిగించే ముక్క ఎడనన్న ఉంటదో ఏమోనని ఎంతగానో చెవులప్పగించి విన్న, కానీ ఎక్కడ వీళ్ళ గురించి ఒక్క మాట ఇనబడలేదు. ఏమి లాభం. ఇంతగణం అలిసి పోయిన ఆవిసి పోయిన బతుకులకే సత్వర సహాయం అందించ లేని సర్కారు ఇంకా ఎప్పుడో ఏందో చేస్తదంటే ఎట్లా నమ్మేది. ఇప్పటికే రైలు పట్టాల మీద , రోడ్డు ప్రమాద మూలంగా వంద మంది కంటే ఎక్కువమంది చనిపోయిండ్రు.
పురాణాల్లో శునశ్శెపుని గాథ అని ఒక కథ ఉంది. అది ఏందంటే! 100 మంది భార్యలున్న హరిశ్చంద్రునికి ఒక్కగానొక్క కొడుకైనా కలుగలేదు. అందుకు హరిశ్చంద్రుడు, తనకు పుత్రున్ని ప్రసాదిస్తే వాణ్ణే యజ్ఞబలిగా సమర్పిస్తానని వరుణ దేవుణ్ణి వేడుకుంటాడు. కొంతకాలానికి రోహితుడు అనే కొడుకు పుడుతాడు. పుత్రవ్యామోహం తీరిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రోహితుణ్ణి యజ్ఞంలో బలి ఇవ్వడానికి హరిశ్చంద్రుడు సిద్దపడుతాడు. కానీ రోహితుడు అందుకు అంగీకరించక అడవులకు వెళ్ళిపోతాడు. అక్కడ అజిగర్తుడు అనే ఒక ముగ్గురు కొడుకులు గల బ్రాహ్మణుని చూసి నీకు 100 గోవులు ఇస్తాను , నీకున్న ముగ్గురు కొడుకుల్లోనుంచి ఒక కొడుకును తనకు అమ్ముమంటాడు. 100 గోవులను స్వీకారించి తన నడిపి కొడుకు అయిన శునశ్శెపున్ని అమ్మివేస్తాడు. రోహితుడు నగరానికి తిరిగి వచ్చి తన తండ్రితో ” ఇదిగో ఈ బానిసను నీకప్పగిస్తున్నాను, నీ యజ్ఞం నువ్వు చేసుకో ” అంటాడు. యజ్ఞం ప్రారంభం అవుతుంది. ఆ పసి వాణ్ని చంపడానికి ఎవరికి చేతులు రావు. మరో 100 ఆవులు ఇస్తానంటే ఒప్పుకున్న తండ్రి అజిగర్తుడు , శునశ్శెపున్ని ఒక్క వేటున నరికి వేయడానికి కత్తి నూరుతుంటాడు. ఆ పసివాడు గోడు గొడున ఏడుస్తూ తనను కాపాడమని సమస్త దేవతలను ప్రార్ర్థిస్తాడు. కానీ ఏ ఒక్క దేవుడు కూడా వచ్చి అతన్ని కాపాడడు. అజిగర్తుడు కత్తి చేతబట్టి శునశ్శెపున్ని సమీపిస్తాడు. యూపస్తంభానికి కట్టివేయబడిన ఆ బాలుడు మృత్యు ముఖం లోకి చూస్తూ ఈ కింది విధంగా తన చివరి నమస్కారం చేస్తాడు.
” నమో మహాభ్యః నమో అర్భకేభ్యః
నమో యువభ్యోః నమో ఆశనేభ్యః “
అంటే మనుషుల్ని చంపి కాల్చుక తినే మహానుభావులకు నకస్కారం. ఇంత కిరాతం జరుగుతున్నా ఏమీ చేయలేని వెధవలకు కూడా నమస్కారం.తిండి దండుగ చవటలకు కూడా నమస్కారం. అంటూ అక్కడ జేరిన వారిపై అతడు తన జుగుప్సను, అసహ్యాన్ని ప్రకటిస్తాడు. సమస్త వైదిక వాగ్మయమ్ లో శునశ్శెపుని గాథ అత్యంత దయనీయం, అమానుశమైంది అంటారు.
ఇపుడు వలస కార్మికుల బిడ్డల చూపుల్లో నాకు, ఆనాడు శునశ్శెపుని కండ్లు కురిపించిన శాపనార్థాలే కనిపిస్తున్నాయి.
-వీరగోని పెంటయ్య