Suryapet Khammam Highway: అదాని అయితే చాలు.. మిగతావేవీ అవసరం లేదు

సూర్యాపేట ఖమ్మం మధ్య నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి కాంట్రాక్టును.. నిర్మాణంలో ఎటువంటి అనుభవం లేని అదాని కంపెనీకి కట్టబెట్టారని కాగ్ తాజా నివేదిక వెల్లడించింది.

Written By: Srinivas, Updated On : August 26, 2023 4:34 pm

Suryapet Khammam Highway

Follow us on

Suryapet Khammam Highway: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నప్పటికీ సింహభాగం దక్కుతుంది. ఇప్పుడు మోడీ జమానాలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ అదాని గ్రూప్ కు అలాంటి ప్రయోజనమే లభిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భారీగా ప్రయోజనాలు కల్పిస్తుందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. తాజాగా కాగ్ నివేదిక వెలువరించిన మరొక విషయం సంచలనంగా మారింది.

సూర్యాపేట ఖమ్మం మధ్య నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి కాంట్రాక్టును.. నిర్మాణంలో ఎటువంటి అనుభవం లేని అదాని కంపెనీకి కట్టబెట్టారని కాగ్ తాజా నివేదిక వెల్లడించింది. అదాని ట్రాన్స్ పోర్ట్ అనే కంపెనీ సారధ్యంలోని “సూర్యాపేట ఖమ్మం రోడ్డు ప్రైవేట్ లిమిటెడ్” కన్సార్టియానికి ఈ కాంట్రాక్ట్ ను 2019లో మంజూరు చేశారు. కన్సార్టియంలో 74 శాతం వాటా ఉన్న అదానీ ట్రాన్స్ పోర్ట్ జాతీయ రహదారుల నిర్మాణంలో ఐదేళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను పూర్తి చేయలేదు. ఆ కంపెనీ సమర్పించిన పనుల జాబితా ప్రకారం.. గతంలో ఎన్నడూ ప్రత్యక్షంగా, పరోక్షంగా రోడ్డు నిర్మాణ పనుల్లో పాల్గొన్న అనుభవం లేదు. అయినప్పటికీ, జాతీయ రహదారుల అథారిటీ సంస్థ ఎటువంటి కారణాలు చూపుకుండానే , కంపెనీని సాంకేతికపరంగా అర్హత కలిగి ఉన్నట్టు ప్రకటించింది.

1566.30 కోట్ల విలువైన ప్రాజెక్టును 2019 మార్చిలో మంజూరు చేసింది. కాంట్రాక్టు ప్రక్రియ సందర్భంగా కన్సార్టీయంలోని ప్రధాన భాగస్వామి అదాని ట్రాన్స్ పోర్ట్ మరో కంపెనీ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గా ప్రభుత్వానికి సమర్పించింది. ఆ “మరో కంపెనీ” కి అసలు రహదారుల నిర్మాణంలో పనిచేసిన అనుభవం లేదు. అది విద్యుత్ రంగంలో పనిచేసే కంపెనీ మాత్రమే. దీంతోపాటు ప్రధాన భాగస్వామి 304.33 కోట్ల కనీస నికర ఆస్తులను కలిగి ఉన్నట్టు ధ్రువీకరించే చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ థర్డ్ పార్టీ పేరు మీద ఉందని పరిశీలనలో వెళ్ళడైంది. అయితే దీనికి సంబంధించిన వివరణ న్యూస్ లాటరీ వెబ్సైట్ తెలియజేసింది. కాగ్ వెల్లడించిన అంశాలపై అదాని గ్రూప్ సంస్థల అధికార ప్రతినిధిని న్యూస్ లాండ్రీ సంప్రదిస్తే.. అదాని గ్రూపు సంస్థలు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఎటువంటివైనా తాము వాటిని ఖండిస్తామని చెప్పారు. రహదారుల నిర్మాణ రంగంలో అనుభవం విషయంలో కన్సార్టీయంలోని మరొక కంపెనీ అర్హత సరిపోయిందని, నికర ఆస్తులు విషయంలో అదాని ఎంటర్ప్రైజెస్ ఆస్తులను పరిగణనలోకి తీసుకున్నారని వివరించారు. సూర్యాపేట ఖమ్మం నాలుగు వరసల జాతీయ రహదారిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించారు. ఇందులో జాతీయ రహదారుల సంస్థకు 40 శాతం వాటా ఉంది. అయితే మిగతా 60 శాతాన్ని అదాని గ్రూప్ 25 శాతం మాత్రాన్నే కన్సార్టియం చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరించింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయిపోయి ప్రస్తుతం వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే దీనిపై కాగ్ నివేదిక వెలువడటం సంచలనం కలిగిస్తోంది.