Central Cabinet Expansion: ఉప ఖండంలో అజేయమైన రాజకీయ శక్తిగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పార్టీ విస్తరిస్తోంది. మోదీ, షా ద్వయం అంతులేని విజయం వెనుక కీలక పాత్ర పోషించింది. ఒక పద్దతి ప్రకారం పార్టీని విస్తరించారు. కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఉత్తరాధిలో వారి ప్రయత్నం వర్కవుట్ అయినా.. దక్షిణాదికి వచ్చేసరికి మాత్రం ఆశించినా ఫలితం ఇవ్వలేదు. ఒక్క కర్ణాటకలో తప్పించి మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోతోంది. ముఖ్యంగా ఏపీలో ఉనికి చాటుకునేందుకు కూడా పడరాని పాట్లు పడుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి దశాబ్ద కాలం సమీపిస్తున్నా ఏపీలో బీజేపీ బలపడకపోవడం వారికి కలవరపాటుకు గురిచేస్తోంది.

మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం బీజేపీ రోజురోజుకూ బలపడుతోంది. అక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టి సవాలే విసురుతోంది. విపక్ష కాంగ్రెస్ తో పాటు బీర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకునే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్ ను మట్టి కరిపించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే ఆ స్థాయిలో చొరవ ఏపీలో చూపకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. తెలంగాణ స్థాయిలో ఏపీ బీజేపీకి హైకమాండ్ చేయి అందించడం లేదన్న టాక్ నడుస్తోంది. కేంద్ర కేబినెట్ లో ఏపీని విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో బీజేపీ నాలుగు లోక్ సభ స్థానాలను దక్కించుకుంది. దీంతో ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో తీసుకున్నారు. ఏపీలో ప్రత్యక్షంగా ఎన్నికైనా ఎంపీలు లేకున్నా.. రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కనీసం వారిని పరిగణలోకి తీసుకోలేదు.
సంక్రాంతి తరువాత కేంద్ర కేబినెట్ ను పనర్వ్యవస్థీకరిస్తారని ప్రచారం సాగుతోంది. ఈసారి ఏపీకి తప్పకుండా ప్రాతినిధ్యం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో ఒకరు సీఎం రమేష్, మరోకరు జీవీఎల్ నరసింహరావు. అయితే ఇందులో సీఎం రమేష్ గత ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఎదురుకావడంతో.. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ బీజేపీలో చేరారు. జీవీఎల్ ఏపీ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా.. యూపీ కోటాలో ఎంపికయ్యారు. దీంతో వీరిద్దరిలో ఒకరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కనుందన్న టాక్ నడుస్తోంది.

అయితే ఇద్దరి విధేయత పట్ల సొంత పార్టీ శ్రేణులపై ఒక రకమైన అనుమానాలున్నాయి. సీఎం రమేష్ టీడీపీకి అనుకూలంగా, జీవీఎల్ వైసీపీకి అనుకూలంగా ఉంటారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అటు బీజేపీ హైకమాండ్ సైతం కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను పరిగణలోకి తీసుకునే మంత్రివర్గాన్ని విస్తరిస్తోంది. ఈ లెక్కన త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే తెలంగాణకు మరో మంత్రి పదవి కేటాయించే చాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు పదవి ఇచ్చి… తెలుగు రాష్ట్రాలకు రెండు మంత్రి పదవులు ఇచ్చినట్టు గణాంకాలు చూపుకునేందుకే వైసీపీ హైకమాండ్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అటు ఢిల్లీ వర్గాలు సైతం ఏపీకి కేబినెట్ లో చాన్స్ దొరికే అవకాశం లేదని తేల్చిచెబుతున్నట్టు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.