KCR Strategy: ‘మూడు పర్యాయాలు గుజరాత్‌ను పాలించిన నరేంద్రమోదీ ప్రధాని అయ్యాడు. రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా తాను ప్రధాని కావడానికి అర్హుడినే. ఇంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం కావాలి’.. అన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చాలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. పార్టీ ఏర్పాటు చేసిన రెండు నెలల తర్వాత ఖమ్మం వేదికగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభ ద్వారా కేసీఆర్ త్రిముఖ వ్యూహం అమలు చేయాలన్న సంకల్పం కనిపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం వేదికగా భారత్ సింహగర్జన ద్వారా అనేక జాతీయ అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రస్తావిస్తూ తెలంగాణను కూడా టార్గెట్ చేస్తున్నట్లుగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలలో కేసీఆర్‌కు అండగా ఉండాలని భావోద్వేగాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ఖమ్మం వేదికగా టార్గెట్ చేసిన ప్రధానమైన విషయాలు ఏమిటి? ఇక వీటిని సాధించడంలో సక్సెస్ అయ్యారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

దేశ్‌కీ నేత అనిపించుకునే ప్రయత్నం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ్‌కీ నేత అనిపించుకునే ప్రయత్నమే ఖమ్మం సభ ద్వారా ఎక్కువగా చేసినట్లు కనిపిస్తోంది. దేశం దృష్టిని తెలంగాణవైపు మళ్లించడమే లక్ష్యంగా ఈ సభకు 5 లక్షల మందిని తరలించే ప్రయత్నం చేశారు. అట్టహాసంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత మాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సభా వేదికగా దేశ రాజకీయాలపై ఎక్కుపెట్టిన కేసీఆర్ తాను దేశ్‌కీ నేత అనిపించుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ సభతో బీఆర్‌ఎస్‌కు దేశ వ్యాప్త ప్రచారం తీసుకురావడం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు, బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కూడా బీజేపీనే టార్గెట్ చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో పాల్గొనడంతో కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీకి దేశవ్యాప్త ప్రచారం తీసుకువచ్చినట్లు అయింది.
తెలంగాణలో మళ్లీ అధికారమే లక్ష్యంగా..
తెలంగాణ ప్రజల మద్దతు కోసం కేసీఆర్ వ్యూహం కేసీఆర్ ఖమ్మం సభా వేదికగా టార్గెట్ చేసిన మరొక ముఖ్యమైన అంశం తెలంగాణ రాష్ట్రంలో మరోమారు అధికారం. ఇప్పటికే రెండు దఫాలుగా తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు పట్టం కట్టారు. మూడో దఫా కూడా కేసీఆర్‌కు పట్టం కట్టాలని, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని బయలుదేరిన వేళ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి తెలంగాణలో అధికారాన్ని కట్టబెడితే, తాను దేశ రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుందని, మోడీ సర్కార్ పై పోరాటం చేయడానికి తనకు ప్రజల మద్దతు కావాలని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడమే అంతిమ లక్ష్యంగా కేసీఆర్ మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ రెండో లక్ష్యాన్ని చేరుకోవడంలో, ప్రజలను ప్రభావితం చేయడంలో కేసీఆర్ ఏ మేరకు సక్సెస్ అయ్యారనేది తెలియాల్సి ఉంది. దేశ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న వేళ తెలంగాణ ప్రజలు ఆయనకు మద్దతుగా రాష్ట్రంలో మళ్లీ అధికారం కట్టబెడతారా? అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్న. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలలో భావోద్వేగం రగిలించడానికి మాత్రం తన వంతు ప్రయత్నం చేశారు.

ఖమ్మంపై పట్టు సాధించేలా..
ఇక కేసీఆర్ మూడు లక్ష్యం ఖమ్మం రాజకీయాలలో పట్టుకు యత్నం. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి బలహీనంగా ఉంది. పార్టీలో అంతర్గత కలహాలు పార్టీకి ఊపిరాడనివ్వడం లేదు. నేతల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్న పార్టీని, ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఖమ్మం సభ కేంద్రంగా సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సభ ద్వారా ప్రయత్నం చేశారు. ఖమ్మంలో పార్టీ బలోపేతమై, మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం కోసం, ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పడానికే కేసీఆర్ బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించారు. మరి ఖమ్మం రాజకీయాలలో బీఆర్‌ఎస్ పార్టీకి పట్టు చిక్కుతుందా.. లేదా అనేది తేలాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాలి.
మొత్తంగా దేశ రాజకీయాలు అంటున్న కేసీఆర్.. ఖమ్మం సభద్వారా దేశం కంటే ఎక్కువగా రాష్ట్రంలో మరోమారు అధికారంలోకి రావడంపైనే దృష్టిపెట్టినట్లుల కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.