Chandrababu: చంద్రబాబు గెలిస్తే ఆ కేసులు క్లోజ్

జగన్ పై నాడు అవినీతి కేసుల్లో చంద్రబాబుదే ప్రధాన హస్తం అన్నది వైసిపి ఆరోపణ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చేతులు కలిపి తనపై కేసులు చంద్రబాబు నమోదు చేయించారన్నది జగన్ లో ఉన్న ప్రధాన అనుమానం.

Written By: Dharma, Updated On : May 22, 2024 12:15 pm

Chandrababu

Follow us on

Chandrababu: రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. పోలింగ్ ముగిసింది. రికార్డు స్థాయిలో నమోదయింది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. పోలింగ్ శాతం పెరగడం, ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించడంతో కూటమి పార్టీలో జోష్ నెలకొంది. అయితే కూటమి గెలిస్తే.. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు శరవేగంగా మారిపోనున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు పై నమోదైన అవినీతి కేసుల్లో పురోగతి మందగించే అవకాశం ఉంది. దాదాపు కేసులన్నీ క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సిఐడి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుంది. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే.. ఆ కేసులు కొట్టివేతకు తప్పకుండా ప్రాధాన్యమిస్తారు.

జగన్ పై నాడు అవినీతి కేసుల్లో చంద్రబాబుదే ప్రధాన హస్తం అన్నది వైసిపి ఆరోపణ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చేతులు కలిపి తనపై కేసులు చంద్రబాబు నమోదు చేయించారన్నది జగన్ లో ఉన్న ప్రధాన అనుమానం. అందుకే చంద్రబాబు పై రివెంజ్ తీర్చుకోవాలని జగన్ భావించారు. సిఐడి ని అడ్డం పెట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం, ఇసుక, మద్యం తదితర స్కాములన్నీ కలిపి.. 12 కేసులు వరకు నమోదు చేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులు చంద్రబాబు దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలు చూపి బెయిల్ పై బయటకు వచ్చారు.

అయితే తన కేసుల నమోదు విషయంలో 17a నిబంధన పాటించలేదన్నది చంద్రబాబు నుంచి వచ్చిన ప్రధాన అభ్యంతరం. దీనిపై అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయ్యింది. ఒకవేళ టిడిపి కూటమి అధికారంలోకి వస్తే కేసులు నమోదు చేసిన సిఐడి.. ఉపసంహరించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. స్థానిక సీఐడీ మెజిస్ట్రేట్ ముందు కేసులు విత్ డ్రా చేసుకుంటే చాలు.. చంద్రబాబుకు విముక్తి కలిగినట్టే. రాజకీయ ఒత్తిళ్ళతోనూ, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో తాము కేసులు నమోదు చేశామని చేతులు దులుపుకోవచ్చు. ఒకవేళ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం.. ఈ కేసులను చంద్రబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జూన్ 4న వచ్చే ఫలితం బట్టి పరిణామాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.