https://oktelugu.com/

Nara Lokesh Padayatra : లోకేష్ పాదయాత్ర వేళ కొత్త ట్విస్ట్

మనం చేస్తే లోక కళ్యాణం.. ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది జగన్ సర్కారు వైఖరి. విపక్షంలో ఉన్నప్పుడు ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్.. తన తరువాత అటువంటి యాత్రలు ఎవరూ చేయకూడదని భావిస్తున్నట్టున్నారు. నారా లోకేష్ యువగళం పేరిట ప్రారంభించనున్న పాదయాత్రను పోలీస్ శాఖ ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. అయిదు రోజుల్లో ప్రారంభించనున్న పాదయాత్రకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఆరు నెలల కిందటే టీడీపీ లోకేష్ పాదయాత్రకు ప్లాన్ చేసింది. ప్రభుత్వం […]

Written By:
  • Dharma
  • , Updated On : January 22, 2023 / 12:38 PM IST
    Follow us on

    మనం చేస్తే లోక కళ్యాణం.. ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుంది జగన్ సర్కారు వైఖరి. విపక్షంలో ఉన్నప్పుడు ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్.. తన తరువాత అటువంటి యాత్రలు ఎవరూ చేయకూడదని భావిస్తున్నట్టున్నారు. నారా లోకేష్ యువగళం పేరిట ప్రారంభించనున్న పాదయాత్రను పోలీస్ శాఖ ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నట్టు సంకేతాలిస్తున్నారు. అయిదు రోజుల్లో ప్రారంభించనున్న పాదయాత్రకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఆరు నెలల కిందటే టీడీపీ లోకేష్ పాదయాత్రకు ప్లాన్ చేసింది. ప్రభుత్వం నుంచి ఎదురుకానున్న సవాళ్లను ముందే అంచనా వేసింది. వైసీపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు రావొచ్చు.. వాటిని ఎలా ఎదుర్కొవాలి? అన్న దానిపై ముందస్తుగా కసరత్తు చేశారు. లోలోపలే ఒక ప్లాన్ ప్రకారం వ్యూహాన్ని రూపొందించారు. ఇప్పుడు టీడీపీ ఊహించినట్టే వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది. లోకేష్ యువగళానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం మొదలుపెట్టింది. లోకేష్ కు ఎనలేని ప్రచారం కల్పిస్తోంది. అటు ఎల్లో మీడియాకు పనిచెప్పింది. లోకేష్ కు మద్దతుగా కథనాలు వండి వార్చడానికి అవకాశం ఇచ్చింది.

    లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. ఆయనకు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించాలని టీడీపీ రాష్ట్ర డీజీపి నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీ, డివిజన్, మండల స్థాయి పోలీస్ అధికారులకు లేఖ రాసింది. కానీ పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి నేరుగా లేఖ రాశారు. దీంతో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు, పాదయాత్రకు సంబంధించి డీటైల్స్ అందించాలని కోరారు. అయితే గతంలో చాలా మంది నేతలు పాదయాత్ర చేసినా.. వారెవరూ సమర్పించని వివరాలను అడిగేసరికి దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ రోజు ఎక్కడ పాదయాత్ర చేస్తారు? ఎవరెవరు పాల్లొంటారు? వాహన శ్రేణి సంఖ్య? వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు కావాలని అడిగేసరికి టీడీపీ అదే స్థాయిలో రియాక్టయ్యింది. నాటి మహాత్మ గాంధీ యాత్ర నుంచి నేటి రాహుల్ పాదయాత్రకు సంబంధించి పర్మిషన్లు ప్రస్తావిస్తూ ఆ వివరాలేవీ అవసరం లేదని టీడీపీ తిరిగి డీజీపీకి లేఖ రాసింది. ఇప్పుడు పోలీస్ శాఖ లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ ఇస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు కొత్త ట్విస్ట్.

    మొత్తానికైతే లోకేష్ పాదయాత్రకు పనిగట్టుకొని వైసీపీ సర్కారు ప్రచారం కల్పిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఒక వేళ కానీ పాదయాత్రను అడ్డుకుంటే మాత్రం నిజంగా లోకేష్ ను భావినేతగా ఒప్పుకొని భయపడినట్టేనన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ సుదీర్ఘ కాలం పాదయాత్ర, ఓదార్పు యాత్ర చేసి అద్భుత విజయాన్ని పొందగలిగారు. ఇప్పుడు తన మాదిరిగా లోకేష్ పాదయాత్ర చేస్తుండడం..తనలాగే రాజకీయ లబ్ధిపొందుతారన్న అక్కసుతోనే అడ్డుకుంటున్నారన్న అపవాదును మాత్రం జగన్ మూటగట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు లోప్రొఫైల్ లో టీడీపీ కసరత్తు పూర్తిచేసింది. కానీ వారికి పనిచెప్పకుండా ఇప్పుడు జగన్ సర్కారే లోకేష్ కు విస్తృతమైన కవరేజ్ ఇవ్వడం సొంత పార్టీ శ్రేణుల్లో సైతం విస్మయం వ్యక్తమవుతోంది.

    ఇప్పటికే ప్రభుత్వం జీవో1ను జారీచేసింది. అది విపక్షాల గొంతు నొక్కడానికేనన్న ప్రచారం ఉంది. ప్రధానంగా లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సుయాత్రను అడ్డుకోవడానికేనన్న విపక్షాల ప్రచారాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కేవలం ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను మరింత పెంచేందుకు వీరి యాత్రలు దోహదం చేస్తాయని ప్రభుత్వం భయపడినట్టు అర్ధమవుతోంది. జగన్ మాదిరిగా లోకేష్ కూడా తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం ఎంపీపీ కోదండరెడ్డి లోకేష్ పాదయాత్రను అడ్డుకుందామని, అవసరమైతే దాడులు చేద్దామని ఇచ్చిన పిలుపు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక హైకమాండ్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అందుకే పోలీసు శాఖ ద్వారా వైసీపీ సర్కారు ట్విస్టులపర్వం నడుపుతోందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. మొత్తానికైతే లోకేష్ పాదయాత్ర ప్రారంభించకుండానే భారీ ప్రచారం కల్పించిన ఘనత జగన్ సర్కారుకే దక్కుతుంది.