LV Subrahmanyam: ఏపీ ప్రభుత్వ మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం జగన్ సర్కార్ పై యుద్ధం ప్రకటించారు. ఏపీలో విశ్రాంత ఉద్యోగులు విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పోరాటానికి సిద్ధపడ్డారు. 2019 ఎన్నికల నాటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉండేవారు. కానీ జగన్ కు ఆయన కొనసాగింపు ఇచ్చారు. ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. సుబ్రహ్మణ్యం సైతం సీఎం జగన్ అంటే ఎనలేని అభిమానంతో ఉండేవారు. అయితే వారి మధ్య ఎక్కడ తేడా కొట్టిందో కానీ పదవి విరమణకు ముందు అప్రాధాన్య పోస్టులోకి పంపించారు. దీంతో అవమానంగా భావించిన ఎల్.వి చివరి వరకు సెలవు పెట్టి పదవీ విరమణ చేశారు.
ఇప్పుడు అదే ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ సర్కార్కు కొరకరాని కొయ్యగా మారారు. ఏకంగా పెన్షనర్లతో ఓ పార్టీ పెట్టించి పోరాటానికి దిగడం విశేషం. టిడిపి ప్రభుత్వ హయాంలో ఐవైఆర్ కృష్ణారావు ఒక వెలుగు వెలిగారు. ఆయన సీఎస్ గా పని చేశారు. పదవీ విరమణ తర్వాత చంద్రబాబు ఆయన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. కానీ 2019 ఎన్నికలకు ముందు టిడిపికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. 2019 ఎన్నికల తర్వాత ఐ వై ఆర్ కృష్ణారావు బిజెపిలో చేరారు. అయితే గతం మాదిరిగా జగన్ సర్కార్ పై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కానీ.. కొన్ని రకాలుగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైఫల్యాలను అండగట్టారు. సరిగ్గా ఐవైఆర్ మాదిరిగానే ఎల్వి సుబ్రహ్మణ్యం ఇప్పుడు జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు.
ప్రతి నెల పెన్షనర్లు పింఛన్ కోసం ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉంది. మూడో వారం దాటితే కానీ పెన్షన్ దొరకని పరిస్థితి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటుచేసి కొంతమంది పోరాడుతున్నారు. దీనికి ముందుండి నడిపించేందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం ముందుకు రావడం విశేషం. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఎల్.వి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్ళు అయితే అందరి హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్రం కాపాడ పడుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం పెన్షనర్లను దారుణంగా వంచిస్తుందన్నారు. దీనికి మూల్యం తప్పదని హెచ్చరించారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బయటకు వచ్చి జగన్ సర్కార్ పై పోరాడుతుండడం విశేషం.