Visakhapatnam Bus Shelter: వైసీపీ ప్రభుత్వ పనితనానికి నిదర్శనం ఇదీ

వాస్తవానికి ఇది శాశ్వత నిర్మాణం కాదు. రేకులతో కట్టేసి.. పిల్లర్ లేకుండా రాడ్లతో కట్టేశారు. దానికి అదనంగా డెకరేషన్ చేసి వదిలేశారు.

Written By: Dharma, Updated On : August 28, 2023 8:53 am

Visakhapatnam Bus Shelter

Follow us on

Visakhapatnam Bus Shelter: విశాఖలో కట్టక కట్టక ఒక బస్సు షెల్టర్ ను నిర్మించారు. ప్రారంభించక ముందే అది కూలిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దక్షిణ వైపు మోడరన్ బస్సు షెల్టర్ నిర్మించారు. దానికి అందంగా డెకరేషన్ చేసి జగన్ సర్కార్ సంక్షేమ పథకాల వినైల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రయాణికులు వేచి ఉండగా ఒక్కసారిగా ఈ షెల్టర్ కూలిపోయింది. ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి ఇది శాశ్వత నిర్మాణం కాదు. రేకులతో కట్టేసి.. పిల్లర్ లేకుండా రాడ్లతో కట్టేశారు. దానికి అదనంగా డెకరేషన్ చేసి వదిలేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా 20 మోడల్ బస్సు షెల్టర్లను నిర్మించాలని నిర్ణయించారు. దీనికిగాను రూ.4.62 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీటిలో ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా గ్రానైట్ పలకలతో అరుగులు, లైటింగ్, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు సమకూర్చుతామని జీవీఎంసీ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే జీవీఎంసీ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్నింటి నిర్మాణం పూర్తి కాగా.. ఇటీవలే ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక వైపు సౌత్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించిన ఈ బస్సు షెల్టర్ కూలిపోయింది.

శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఈ బస్ షెల్టర్ పైకప్పుగా వేసిన ఎమ్మెస్ రేకుపై నీరు నిలిచిపోయింది. అస్మదీయుడైన వ్యక్తికి అన్ని బస్సు షెల్టర్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారని.. ఒక్కో దానికి ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు కానప్పటికీ
.. రూ.25 లక్షల వరకు బిల్లు చెల్లిస్తున్నారని విమర్శలు వ్యక్తమయ్యాయి. బస్సు షెల్టర్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇది పెద్ద విషయం కాదని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు లైట్ తీసుకుంటున్నాయి.