Cheating husband :‘ఒక్క పెళ్లాన్ని మెయింటేన్ చేయడానికి చినిగి చాటవుతోంది.. వీడేంట్రా బాబు ఏకంగా 11 మందిని పెళ్లాడాడు. మరీ దారుణం ఏంటంటే.. అందులో ముగ్గురు భార్యలను పక్కపక్కన మూడు వీధుల్లో పెట్టాడు. పెళ్లాలతో నరకం చూస్తున్న భర్తలకు వీడు నిజంగానే స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీడు ఎంత పెద్ద క్రైం చేసినా.. పోలీసులకు చిక్కినా కూడా వీడి గట్స్ చూసి.. ‘వీడు మగాడ్రా బుజ్జీ’ అని పురుష పుంగవులంతా కొనియాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంతకీ 11 మందిని పెళ్లాడిన ఈ నిత్య పెళ్లికొడుకు కథ ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.

సినిమాల్లో కన్ఫ్యూజన్ కామెడీ అంటే సాధారణంగా ఒక వ్యక్తి ఇద్దరు లేదా ముగ్గురు ఆడవాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని మెయింటైన్ చేయడానికి కిందామీద పడడం మనం తెరపై చూసి నవ్వుకున్నాం.. గుంటూరు జిల్లా బేతపూడికి చెందిన అడపా శివశంకర్‌బాబు అనే వ్యక్తి 11 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. హైలైట్ ఏంటంటే ఏడుగురు మహిళలు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని పక్క వీధుల్లో ఉంటున్నారు. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భర్త ఫోన్ కు వేరే ఇతర మహిళ మాట్లాడితేనే అనుమానించి భర్త తాట తీసే భార్యలున్న ఈరోజుల్లో ఇంతమందిని ఎలా మెయింటేన్ చేశావ్ రా అని మన మగజాతి ప్రశ్నిస్తోంది.
శివశంకర్ విడాకులు తీసుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారితో ప్రేమాయణం సాగిస్తాడు. పగలు, రాత్రి తేడా లేకుండా షిఫ్టుల వారీగా పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు. అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యకరంగా చాలా మంది మహిళలు బాగా చదువుకున్నారు.
ఈ రోజు ఇద్దరు మహిళలు మీడియా ముందుకు వచ్చి శివశంకర్ మోసం గురించి వెల్లడించారు. శివశంకర్ తమ నుంచి లక్షల రూపాయలు తీసుకుని అదృశ్యమయ్యాడని వాపోయారు. అతను తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసాడని.. తర్వాత ఎప్పటికీ కనిపించడు.
దాదాపు 60 లక్షల రూపాయల నగదు, బంగారం ఇచ్చినట్లు మహిళలు వెల్లడించారు. శివశంకర్ కూడా ఏపీలో ఓ మంత్రికి బంధువని చెప్పి వారిని మోసం చేసినట్లు తెలుస్తోంది.
ఇలా నిత్యపెళ్లికొడుకు అటు సుఖానికి సుఖం.. ఇటు డబ్బుకు డబ్బు కొల్లగొట్టి ఈ 11 మంది మహిళలను దారుణంగా మోసం చేశాడు. వీడు దొరికితే కుమ్మేయడానికి ఆ బాధిత భార్యలంతా రెడీగా ఉన్నారు. ఇలాంటి వాడిని ఊరికే వదలవద్దని బాధితులు కోరుతున్నారు. సభ్యసమాజంలో ఇలాంటి మోసగాళ్లకు తగిన శిక్ష వేస్తే తప్ప ఇలాంటి మోసాలకు అడ్డుకట్టపడదు. అమాయపు ఆడవాళ్లతో ఆటలాడుతున్న వీడిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.