Chiranjeevi: ప్రధాని ఏపీ టూర్ లో రాజకీయాలను పక్కనపెడితే మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గౌరవం లభించింది. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా గత కొద్దిరోజులు దూరంగా ఉంటున్నారు. అంతగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ అధిష్టానం సైతం కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవాలని సూచించినా చిరంజీవి తిరస్కరించారు. తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. అటు సోదరుడు పవన్ కల్యాణ్ జనసేనకు కూడా బహిరంగ మద్దతు ప్రకటించలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ పర్యటనలో చిరంజీవికి అగ్రతాంబూలం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి హోదాలో పిలిచామని బయటకు చెప్పుకొస్తున్నారు. అదే ప్రోటోకాల్ పాటించినప్పుడు స్థానిక ఎంపీ రాఘురామక్రిష్ణంరాజును పిలవవచ్చు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు రాజకీయంగా చూసుకుంటే మరో కేంద్ర మాజీ మంత్రి, నటుడు క్రిష్ణంరాజు కూడా బీజేపీకి చెందిన వ్యక్తే. కానీ చిరంజీవిని మాత్రమే ప్రత్యేకంగా పిలవడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ అవసరాల ద్రుష్ట్యే మాత్రమే చిరంజీవిని పిలిచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమం అద్యాంతం చిరంజీవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని కూడా చిరంజీవికి ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేశారు. దీనిపై చిరంజీవి కూడా అంతే ఆత్మీయంగా ప్రధానితో మెలిగారు. చిరు సన్మానం కూడా చేశారు. సీఎం జగన్ కూడా చిరంజీవిని సోదరుడిగా సంబోధించారు. మొత్తానికైతే అల్లూరి విగ్రహావిష్కరణ సభ చిరంజీవికి గుర్తుండిపోయేలా అటు బీజేపీ పెద్దలు, ఇటు వైసీపీ పెద్దలు వ్యవహరించారు. కానీ దీని వెనుక రాజకీయ పరమార్థం దాగి ఉందన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.

పవన్ ను కట్టడి చేయడానికి..
ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షానికి దీటుగా అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇటు జనసేన ప్రజల్లోకి దూసుకెళుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై వివిధ కార్యక్రమాల పేరిట అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. పవన్ కౌలురైతుల భరోసా యాత్ర చేపట్టారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అక్టోబరు నుంచి బస్సు యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది అధికార పార్టీకి మింగుడుపడని విషయం. అందుకే బీజేపీ పెద్దలతో జగన్ సంధి కుదుర్చుకున్నారు. టీడీపీ, జనసేన కూటమి వైపు బీజేపీ వెళ్లకుండా కట్టడి చేయగలిగారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నిక జగన్ కు కలిసి వచ్చింది. తన అవసరం బీజేపీకి ఏర్పడడం, అందుకు తగ్గట్టు పావులు కదిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న జగన్ తనకు అన్నివిధాలా సాయం చేయాలని బీజేపీని వేడుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతానికైతే బీజేపీ నుంచి జగన్ కు ఎటువంటి ముప్పు లేనట్టే. ఇప్పుడు పవన్ ను కట్టడి చేస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఒంటరి చేయవచ్చన్నది జగన్ భావన. కానీ పవన్ దూకుడు మీదున్నారు. వైసీపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఎవరు చెప్పినా వినే రకం కాకపోవడంతో సోదరుడు చిరంజీవిని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణను పావుగా వాడుకున్నారు. కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచారు. ప్రత్యేక గౌరవమిచ్చారు. ఇంతటితోనైనా పవన్ మొత్తబడతారన్నది ఒకటో ఆలోచన. అదే దూకుడు కొనసాగిస్తే చిరంజీవిని బీజేపీ గూటికి చేర్చడం రెండో ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: BJP vs KCR: కేసీఆర్ పై ప్రతీకారానికి ‘ఈటల’నే బీజేపీ అస్త్రం
బీజేపీ పగ్గాలు అందించేందుకే…
ఏపీలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. పొరుగున తెలంగాణలో బలపడుతున్న పార్టీ ఇక్కడ మాత్రం బలం పెంచుకోలేకపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయలేకపోతోంది. అన్ని ఉప ఎన్నికల్లో పార్టీ చతికిలపడుతోంది. కనీసం డిపాజిట్లు కూడా దక్కడం లేదు. ఇది అధిష్టానానికి కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే మంచి చరిష్మ ఉన్న నాయకుడికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తోంది. అందుకే చిరంజీవిని తెరపైకి తెచ్చారని కనిపిస్తోంది. అదే కానీ జరిగితే పవన్ తమ దారికి వస్తారని కూడా భావిస్తోంది. ప్రస్తుతం పవన్ బీజేపీకి లెక్క చేయని విధంగా తయారయ్యారు. దీంతో కేంద్ర పెద్దలకు ఇది రుచించడంలేదు. పవన్ టీడీపీతో కలిసి వెళితే తమకు అన్నివిధాలా సహాయపడుతున్న వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుంది. అలాగని టీడీపీ, జనసేన కూటమిలోకి వెళ్లడం బీజేపీకి ఇష్టం లేదు. దాని ద్వారాచంద్రబాబు సీఎం అవుతారు తప్పించి తమకు లాభం లేదన్న భావన బీజేపీలో ఉంది. వైసీపీయే నమ్మదగిన మిత్రుడని భావిస్తోంది. అందుకే పవన్ ను దారికి తెచ్చుకోవాలంటే చిరంజీవిని తెరపైకి తేవడమే తమ ముందున్న లక్ష్యమని అటు బీజేపీ, ఇటు వైసీపీ భావనగా ఉంది. అందుకే చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యిమిచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రజారాజ్యం విషయంలో చేతులు కాల్చుకున్న చిరంజీవి రాజకీయాల వైపు చూస్తారో లేదో చూడాలి మరీ. బీజేపీ పెద్దలు మాత్రం కేంద్ర ప్రభుత్వంలో సముచిత స్థానమిచ్చి… రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన అయితే చేస్తున్నట్టుంది మరీ.
Also Read: PM Modi- YS Jagan: ఏపీలో బీజేపీ మార్కు రాజకీయం… వారిద్దరికంటే జగనే మేలంటున్న మోదీ, షా ద్వయం
[…] Also Read: Chiranjeevi: చిరంజీవికి ప్రధాన్యం వెనుక భారీ… […]