కరోనా వైరస్ కేవలం ఆ వ్యాదికే పరిమితం అవడం లేదు. దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగాపడుతోంది. అనేకమంది మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మానసిక సమస్యలకు గురి అవుతున్నారని ఒక ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురం చేసింది. అయితే 95 శాతం మంది తాము మానసిక సమస్యకు గురి అవుతున్నామని అంగీకరించలేకపోతున్నారట. ప్రత్యేకించి కరోనా పై పోరాటం చేస్తున్న డాక్టర్లు, నర్స్ లు, పోలీసులు తదితరులు మరింత మానసిక సమస్య ఎదుర్కుంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్ లు, నర్స్ లు వంటి వారు ఎంతో ధైర్యం చేసి కరోనా వైద్యం చేస్తున్నారు. కాని సమాజంలో వారికి సరైన విశ్వాసం కల్పించడానికి ముందుకు రావడం లేదని వారు బాధపడుతున్నారు. అలాగే పోలీసులు సైతం నిత్యం ఎక్కడో చోట మరణాలు చూసి కలత చెందుతున్నారు. ఇలా ఆయా వర్గాలవారు విపరీతమైన యాంగ్జైటీ, ఒత్తిడి వంటి వాటికి గురి అవుతున్నారు. వీరు మానసిక ప్రశాంతత దిశగా వెళ్లవలసిన అవసరం ఉంది.
మరోవైపు కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉండే వారిలో చాలామందికి చికిత్స సరిగా అందడం లేదు. వారి ఆరోగ్య పరిస్థితిని చాలాచోట్ల పట్టించుకోవడం లేదు. దీంతో అనేకమంది ఆందోళనకు, మానసిక ఒత్తుడులకు గురై మానసిక రోగులుగా మారుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొంత మంది బాధితులు సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ పరిణామం అనర్థాలకు దారితీస్తోంది. ఇంట్లోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే ప్రమాదమూ పెరుగుతోంది. దీంతో టెస్ట్ చేయించుకోవడానికి భయపడుతున్నారు. టెస్ట్ చేయించుకోకపోతే.. కుటుంబంలో ఎవరికి కరోనా ఉందో తెలియక వాళ్ళల్లో వాళ్ళే సతమౌతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక లక్షలమంది హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు కొవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్న వారిని హోం ఐసొలేషన్ లో ఉంచుతున్నారు. వీరి బాగోగుల పర్యవేక్షణ సరిగా లేదు. సరైన వైద్య సలహాలు అందకపోవడంతో బాధితులు ఆందోళనకు గురై సొంతంగా మందులు వాడుతున్నారు. ఈ విషయమై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గత వారం ఆందోళన వ్యక్తం చేసింది. సాధ్యమైనంతవరకు బాధితులు నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.