Kerala Crocodile: బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్న రోజుల్లో ఒక దూరహంకారి అయిన బ్రిటిషు అధికారి చంపిన స్వామివారి మొసలి తిరిగి బతికి దేవుడు ఉన్నాడని నిదర్శనం చూపిన బబియా నేడు తనువు చాలించి వైకుంఠం చేరుకుంది. ఒకప్పుడు చంపినా తిరిగి బతికిన మొసలి మరి ఈరోజెలా మరణించిందని అనుకునేవారూ ఉండచ్చు … మన మేధా శక్తి కంటే భగవంతుని సంకల్పం గొప్పది, ఏ జీవిని ఎందుకు సృష్టిస్తాడో, ఎలా ఆడిస్తాడో ఆయనకే ఎరుక … నమ్మడం నమ్మకపోవడం మన విజ్ఞత … ఏ కారణం చేత ఆ మొసలి సృష్టించబడిందో, ఎందుకు చంపబడి తిరిగి బతికిందో మనకు తెలియదు … ఆ మొసలి పూర్వ జన్మ కర్మ శేషం ఏమిటో, ఎందుకు మాంసాహారం తీసుకోకుండా కేవలం ప్రసాదం తిని బతికిందో … ఏ మహర్షో ఆ మొసలి రూపంలో ఇన్నేళ్ళు తపస్సు చేసుకున్నాడేమో … ఇన్నేళ్ళకు విష్ణువును చేరాడేమో మరి … అంతా విష్ణు లీల
ఇదీ బబియా కథ, స్థల పురాణం
బ్రిటిష్ దూరహంకార అధికారి చంపిన శాకాహార మొసలి తిరిగి బతికి సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తున్న అనంతపుర పద్మనాభ స్వామి వారి మొసలి భక్తులలో భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. కేరళలోని కాసరగోడ్ అనంతపుర పద్మనాభ స్వామి వారి ఆలయంలోని కొలనులో కేవలం స్వామి వారి ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించే శాకాహార మొసలి ” బబియా ” నేటికి మనకు దర్శనమిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎవరికీ హాని చేయని మొసలి స్వామి వారి ప్రసాదం తప్పా ఇంకేమీ తినదు. నీళ్ళలోకి దిగి ఆ మొసలి నోటికి ప్రసాదాన్ని అర్చక స్వాములు ప్రతి రోజు ఉదయం , మధ్యాహ్నం పెట్టడం మనం చూడవచ్చు .
బ్రిటిషు అధికారి దురహంకారం
ఈ ” బబియా ” మొసలి నేటిది కాదు శుమారు 100 సంవత్సరాలకు పూర్వం నుంచే మొసలి, స్వామి వారి నైవేద్యం స్వీకరించడం , ఎవరికీ హాని చేయకపోవడం అందరిని విశేషంగా ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆ మొసలి గురించి విన్న అప్పటి బ్రిటిషు అధికారి ఒకడు స్వయంగా పరీక్షించాలని వచ్చి , ఆ మొసలిని తుపాకితో కాల్చి చంపేశాడు.అధికార మదంతో మొసలిని చంపిన ఆ బ్రిటిషు అధికారిని ఒక పాము కాటువేసి చంపేసింది.
మరునాడు ఆ ఆలయ అర్చకులు మొసలి కోసం ప్రసాదం తయారు చేసి ఆర్ద్రతతో నీటి మడుగులో దిగి ” బబియా ” అని పిలవగానే వెంటనే వచ్చి ప్రసాదం స్వీకరించింది .ఈ బబియా నీటి మడుగుకు ఆనుకుని ఉన్న ఒక గుహలో ఉంటుంది.ఈ గుహకు సంబంధించి ఒక పురాణ గాధ ఉంది.
పురాణ గాధ
మూడు వేల సంవత్సరాల క్రితం దివాకర బిల్వమంగళ మహర్షి శ్రీ మహా విష్ణువు గూర్చి తపస్సు చేస్తుండేవారు.ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహా విష్ణువు ఒక చిన్న బాలుని రూపంలో ఆయనకు దర్శనమిచ్చారు. ఆ పసి బాలుడే శ్రీ హరి అని గుర్తిచాలేకపోయిన మహర్షి ఆ బాలుని పలకరించారు. ఆ బాలుని మాటలు , అందానికి , ఆకర్షణకి ముగ్ధులై ఆయనతో తల్లితండ్రుల గురించి అడిగారు.ఆ బాలుడు తనకు తల్లి తండ్రులు లేరని చెప్పాడు.అయితే తనతో ఉండమని మహర్షి అడిగారు. ఆ బాలుడు ఒక నియమంపై మాత్రమే ఉండగలను అని బదులిచ్చాడు. అదేమిటంటే ఎన్నడూ ఆ బాలుడ్ని తిట్టడం చేయకూడదు , ఏ పరిస్థి తుల్లోలైనా తిడితే తాను వెళ్ళిపోతాను అన్నాడు . ఆ నియమానికి అంగీకరించి ఆ బాలుడ్ని తన ఆశ్రమంలో అల్లారుముద్దుగా చూసుకునేవారు మహర్షి. ఆ బాలుని రూపంలో ఉన్న శ్రీ హరి మహర్షికి ఆగ్రహం కలిగించాలని ఎన్నో విధాలా ప్రయత్నం చేసేవారు.కానీ ఎంతో సహనం ఓర్పుతో భరించే వారే తప్ప ఎన్నడూ ఆ బాలుడ్ని కోప్పడలేదు. మహర్షి దగ్గర శ్రీ మహా విష్ణువు ప్రతిరూపం అయిన సాలగ్రామాలు ఉండేవి . సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం.ప్రతి రోజు వాటికి అభిషేకం , పూజ , నైవేద్యం పెట్టి ఆరాధించేవారు మహర్షి. ఒకనాడు ఈ బాలుడు మహర్షి సాలగ్రామానికి పూజ చేస్తుండగా వచ్చి ఆ సాలగ్రామాన్ని నోటిలో పెట్టుకున్నాడు.
వెంటనే కోపోద్రిక్తుడైన మహర్షి ఆ బాలుడ్ని తిట్టారు. వెంటనే ఆ బాలుడు నువ్వు నన్ను తిట్టిన కారణం చేత నియమాన్ని అతిక్రమించావు కనుక నేను వెళ్ళిపోతున్నాను అంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. మహర్షి ఆ బాలుడ్ని వదిలి ఉండలేక వెనుకనే పరుగులెడుతూ ఆ బాలుడ్ని అనుసరించాడు.అలా వెళ్ళి వెళ్ళీ ఆ బాలుడు ఒక గుహ దగ్గర అదృశ్యమయ్యాడు.ఆ గుహలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక మార్గం కనిపించింది.ఆ మార్గం గుండా వెళ్ళగా ఒక పెద్ద అశ్వత్ధ వృక్షం కింద ఆ బాలుడు మరలా కనిపించి అదృశ్యుడయ్యాడు. దాంతో ఆ మహర్షి పరి పరి విధాల తపించి విలపిస్తుండగా ఆ అశ్వద్ధ వృక్షం ఆకాశం బద్దలయ్యేలా పెళ పెళ ధ్వనులతో విరుగుతూ అనంతశయనంపై చతుర్భుజాలతో శ్రీ మహాలక్ష్మి తో దర్శనం ఇచ్చారు శ్రీ హరి. అదే నేడు మనం దర్శిస్తున్న తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారు. దివాకర బిల్వమంగళ మహర్షి ఆశ్రమం ప్రాంతంలోనే ఈ అనంతపుర ఆలయం ఉంది. కనుకే అది మూలస్థానం.
అక్కడే ఆ గుహలోనే బబియా నివాసం. బబియాకు పెట్టే ప్రసాదాన్ని ” మొసలి నైవేద్య ” అంటారు. బెల్లం పొంగలి ఒక కిలో చొప్పున రెండు పూటలా రెండు కిలోలు బబియాకు సమర్పిస్తారు.ఈ బబియాను శ్రీ పద్మనాభ స్వామి వారిగా భావిస్తారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయ సరస్సులో ఎప్పుడూ ఒకే ఒక మొసలి కనిపిస్తుందట. ఒకవేళ ఆలయ రక్షకురాలు బబియా చనిపోతే సరస్సులోకి మరో కొత్త మొసలి వచ్చి, బబియా బాధ్యతలు స్వీకరిస్తుందని ఇక్కడి వారి నమ్మకం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 70 year old vegetarian crocodile who lived in kerala ananthapadmanabha swamy temple pond dies
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com