Five Villages From AP to Telangana: ఏపీలో విలీనమై దాదాపు ఏడేళ్లు దాటుతోంది. అంతా సాంకేతికంగా ప్రక్రియ జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం తాము ఏపీతో ఉండలేము.. తెలంగాణాలో కలిపేయ్యాలని ఈ ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చిన్నపాటి పనికైనా వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని.. చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు. 40 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు మాకు ఆంధ్ర వద్దు.. తెలంగాణే ముద్దు అంటూ నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాంకేతికంగా ఇది కుదరని పని అయినా కొంతమంది ఇదే పనిగా విలీన గ్రామాల ప్రజలను రెచ్చగొడుతుండడంతో వారు రోడ్డుపైకి వస్తున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. మా జీవితం తెలంగాణతోనే.. మాబతుకులు తెలంగాణతోనే అన్న కొత్త నినాదంతో ఐదు గ్రామాల ప్రజలు రావడం ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఎటపాక, కన్నాయిగూడెం,పిచుకులపాడు,పురుషొత్తపట్నం, గుండాల గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయి. అయితే విలీనమైతే జరిగింది కానీ ఎప్పటికప్పుడు ఈ గ్రామాల్లో మాత్రం తెలంగాణలో కలపాలన్న డిమాండ్ వస్తోంది. అయితే ఇటీవల వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ఏపీ సర్కారు తమకు ఏమీ చేయలేదన్న నిస్సహాయత ఈ గ్రామాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే తెలంగాణలో కలపాలన్న డిమాండ్ తీవ్రమవుతోంది. స్థానికంగా కూడా తీర్మానాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఐదు గ్రామాలు వైసీపీకి పట్టున్నవి. అందుకే కొందరు ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని తీర్మానాలు బయటకు రాకుండా చేశారన్న ప్రచారం సాగుతోంది.
వ్యయప్రయాసలకోర్చుతున్నాం…
ఇటీవల వందలాది మంది తెలంగాణ, ఏపీ సరిహద్దులోని రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణకు చెందిన వామపక్ష నేతలు వారి నిరసనకు మద్దతు తెలిపారు. తమ ఐదు గ్రామాలను తెలంగాణాలో కలపాలని నడిరోడ్డుపై బైఠాయించారు. ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైతెలంగాణ, ఆంధ్రా వద్దు, తెలంగాణ ముద్దు అంటూ నినదించారు.
Also Read: Jagan And KCR- Early Elections: అలా చేస్తేనే గెలుస్తారు.. కేసీఆర్, జగన్ లకు కుండబద్దలుకొట్టిన ‘పీకే’
తమ సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకు, ఆర్డీవో కార్యాలయానికి , కలెక్టరేట్ కు వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చవలసి వస్తోందని..కనీసం నాలుగు గంటల పాటు ప్రయాణిస్తే కానీ.. చేరుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం నియోజకవర్గంలో కలిపితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని భావిస్తున్నారు. అయితే ఈ ఐదు గ్రామాలను తిరిగి విలీనం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు వెలుగులోకి వస్తున్నారు. గోదావరి కరకట్టల నిర్మాణానికిగాను ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని అక్కడి మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేయడం అనుమానానికి బలం చేకూరుస్తోంది. టెక్నికల్ గా ఇది జరిగే పనికాదని తెలిసినా.. పదే పదే వ్యాఖ్యానిస్తుండడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది.
కొందరి స్వార్థానికే…
అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే కొత్తగా విలీనం చేయాలని డిమాండ్ తెరపైకి తెస్తున్నారని ఆదివాసి సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులతో ఏర్పాటుచేసిన అల్లూరి జిల్లా నుంచి గిరిజన గ్రామాలను వేరుచేయాలని సహేతుకం కాదన్నారు.తెలంగాణలో గిరిజనులకు రక్షణ లేదన్నారు. ఐదు గ్రామాల్లో ప్రభుత్వ భూములపై కన్నేసిన వారే విలీనం చేయాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారని.. వారే ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గిరిజనులు వారి ట్రాప్ లో పడొద్దని విన్నవిస్తున్నారు. దీనిపై గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.
Also Read:Heavy Rains in Telangana: కుండపోత వానలు గుండెకోతను మిగుల్చుతున్నాయా?