
దేశంలో కరోనా ఎంట్రీలో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. కేంద్రం విధించిన 21రోజుల లాక్డౌన్ ఈనెల 14తో పూర్తవుతుందని అందరూ భావించారు. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కేంద్రం మరో రెండువారాలపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 30వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తూనే కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. తెలంగాణ, ఏపీలోనూ ఇళ్ల నుంచి బయటికి వచ్చే మాస్కు ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే బహిరంగం ఉమ్మివేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన సంగతి తెల్సిందే. అదేవిధంగా ఒడిశాలో మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.200 జరిమానా అమలు చేస్తుంది. తొలి మూడుసార్లు వరకు రూ. 200జరిమానా పరిమితం చేశారు. ఇక నాలుగోసారి ఉల్లంఘిస్తే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్కలు ధరించాలని నిబంధన చేసింది. నగరంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే ముఖానికి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తాజాగా ప్రకటించింది. లేనట్లయితే మూడేళ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ నిబంధనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.