TDP: తెలుగుదేశం పార్టీలో టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఓవైపు పొత్తుల వ్యవహారం టిడిపి నేతలను చికాకు పెడుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అటు బిజెపితో సైతం పొత్తు సానుకూలంగా ఉంది. సీట్ల సర్దుబాటు విషయం తేలాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉండడంతో టిడిపి నేతలకు త్యాగాలు తప్పడం లేదు.అయితే ఈసారి టిక్కెట్లు ఆషామాషీగా రావని నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు సైతం టిక్కెట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ నిబంధన పెట్టారు. అయితే టిక్కెట్ల పేరిట టిడిపిలో వసూళ్ల పర్వం ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాయలసీమలో టికెట్ల వ్యవహారం పెను దుమారానికి దారితీస్తోంది. ఇటీవలే రాయలసీమకు జోనల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బీద రవిచంద్ర యాదవ్, కిలారి రాజేష్ ఉన్నారు. వీరు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి హై కమాండ్ కు నివేదికలు అందించాలి. అయితే వీరిద్దరూ చీటికిమాటికి హైదరాబాద్ కు అభ్యర్థులను పిలిచి చికాకు పెడుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కాలంటే రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతుండడంతో కొంతమంది అభ్యర్థులు బాహటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీలో మీరెవరు అంటూ నిలదీస్తున్నారు. ఇటువంటి వారి వెనక లోకేష్ ఉన్నారని అనుమానిస్తున్నారు. పార్టీలో ఎన్నడూ లేనివిధంగా ఈ కొత్త సంస్కృతి ఏమిటని వాపోతున్నారు. ఇన్ని రోజులు జెండా పట్టుకుని మోస్తే ఇప్పుడు పక్కన పెడుతూ ఉండడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే వీలైనంతవరకు టిడిపి అభ్యర్థుల నుంచి డబ్బులు రాబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలు టిడిపికి జీవన్మరణ సమస్యలాంటివి. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే. మరోవైపు అధికార వైసిపి దూకుడు మీద ఉంది. భారీగా నగదు పంపిణీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో టిడిపి బలమైన సామాజిక, ఆర్థిక స్తోమత ఉన్న నాయకులను బరిలోదించాలని చూస్తోంది. అందుకే అభ్యర్థుల నుంచి భారీగా నగదు సమీకరణ చేయాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే నిఘా వర్గాల నివేదికలు, రాబిన్ శర్మ టీం సర్వేలు అంటూ అభ్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక టిడిపి ప్రత్యేక ఆర్థిక వ్యూహం ఉన్నట్లు సమాచారం. అయితే రాయలసీమ జోనల్ కమిటీ పైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ఇద్దరు నేతలపైనే ఆర్థిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక హై కమాండ్ ఉందా? లోకేష్ ఉన్నారా? లేకుంటే ఆ ఇద్దరు నేతలు సొమ్ము చేసుకుంటున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.