
దేశంలో మరెక్కడా లేని విధంగా నలుగురు కర్ణాటక మంత్రులు స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. వారిలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఒక వీడియో జర్నలిస్ట్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నెల 21 నుండి 24 వరకు అతనిని కలిసిన మంత్రులు అందరు ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయా మంత్రులు ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఆ విధంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళాను వారిలో ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయి, వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక శాఖ మంత్రి సిటి రవి ఉన్నారు. కోవిడ్ పరీక్షలో నెగిటివ్ అని తేలినప్పటికీ ముందుజాగ్రత్త చర్యలో భాగంగా తామంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మంత్రులతో పాటు, ఆ వీడియో జర్నలిస్టు కుటుంబ సభ్యులతో పాటు అతను సన్నిహితంగా మెలిగిన ఇతర మీడియా సంస్థల జర్నలిస్టులు సహా మొత్తం 40 మందిని స్వీయ నిర్బంధంలో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.
తబ్లీగ్ చీఫ్ అరెస్ట్ పై ఢిల్లీ పోలీసుల వెనుకడుగు!
ఇటీవల తనను కలిసిన ఓ జర్నలిస్టుకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో తనను తాను స్వీయ నిర్బంధంలో ఉంటున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో ఇప్పటివరకు 532 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో 215 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ ధాటికి రాష్ట్రలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.