Lock Of Funding TS Govt Schools: కంపు కొట్టే మరుగుదొడ్లు.. నీళ్లు రాని నల్లాలు.. కరెంట్ ఉన్నా తిరగని ఫ్యాన్లు.. పురుగులు కనిపించే అన్నం.. ఈగలు పైకి తేలే సాంబార్.. అయ్య బాబోయ్ మేం ఈ కాలేజీలో ఉండలేం.. ఇందులో చదవలేమని బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని మొన్న విద్యార్థుల వద్దకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వాటిని చదివిన సబితాఇంద్రారెడ్డి ఇవన్నీ సిల్లీగా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

32 వేల బ్యాంకు ఖాతాలు క్లోజ్ చేశారు
కరోనా దెబ్బకు 15 నెలలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు మొన్ననే తెరుచుకున్నాయి. కానీ ఎప్పటి లాగానే పాఠశాలను సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వం “మన ఊరు మన బడి” పేరుతో పాఠశాలను బాగు చేస్తామని చెప్పినా నిధుల మంజూరు అంతంత మాత్రంగానే ఉంది. కనీసం పాఠశాలల్లో చాక్పీసులు కొనేందుకు డబ్బులు లేక పోవడంతో ప్రధానోపాధ్యాయులే సమకూర్చుకుంటున్నారు. అసలు గతేడాది విద్యాసంవత్సరం ముగిశాక విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు చెందిన నిధులను డ్రా చేసి 32 వేల బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేశారు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో చాక్పీస్ నుంచి రిజిస్టర్ దాకా అన్నింటినీ ప్రధానోపాధ్యాయులు తమ జేబులోనుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Also Read: Secunderabad Agnipath Protests: అగ్నిపథ్ మంటలు: సికింద్రాబాద్ లో రావణకాష్టం
గ్రాంట్ ఎందుకూ సరిపోవడం లేదు
రాష్ట్రవ్యాప్తంగా 26,067 గవర్నమెంట్, లోకల్బాడీస్స్కూల్స్ ఉన్నాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు రూ.12,500 నుంచి రూ. లక్ష వరకు, హై స్కూళ్లకు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మెయింటనెన్స్ గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యాసంవత్సరం మొదలైనా సర్కారు నుంచి గ్రాంట్రాలేదు. డిజిటల్ క్లాసుల నిర్వహణ వల్ల ప్రతి స్కూల్‌కు నెలనెలా తక్కువలో తక్కువ రూ. వెయ్యి నుంచి రూ.1,500 వరకు కరెంటు బిల్లులు వచ్చాయి. స్కూళ్లకిచ్చిన కరెంట్కనెక్షన్లు కమర్షియల్ కేటగిరీ కింద చేర్చడంతో బిల్లులు వాచిపోతున్నాయి. ఇప్పటికే ఒక్కో స్కూలు రూ. 5 వేల నుంచి రూ.20 వేలకు పైగా ట్రాన్స్‌కోకు బకాయి పడింది. కొన్నిచోట్ల బిల్లులు కట్టలేదని కనెక్షన్ తొలగిస్తున్నారు. ఒకవేళ సర్కారు నుంచి గ్రాంట్ విడుదల చేస్తే కరెంట్ బిల్లులకే సరిపోతాయని హెచ్ఎంలు చెబుతున్నారు.
స్కావెంజర్లను తొలగించారు
జీతాలివ్వలేక రాష్ట్రవ్యాప్తంగా 28,200 మంది స్కావెంజర్లను తొలగించిన ప్రభుత్వం.. స్కూళ్లలో పారిశుధ్య పనుల బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించింది. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య పనులే తలకు మించిన భారం కావడంతో మున్సిపల్, పంచాయతీ శానిటరీ వర్కర్లు స్కూళ్ల దిక్కు చూడడమే లేదు. దీంతో చాలా చోట్ల స్కూళ్లలో శానిటేషన్ అధ్వానంగా మారింది. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో క్లాస్‌రూములు ఊడిపిస్తూ, మరుగుదొడ్లు కడిగిస్తున్నారు.

హెచ్ఎంల జేబుల్లోంచే జీతాలు
కరోనా రూల్స్ వల్ల శానిటేషన్‌కు ప్రియారిటీ ఇవ్వక తప్పడం లేదు. బాత్రూమ్ల క్లీనింగ్‌కు ఫినాయిల్, హ్యాండ్‌వాష్, శానిటైజర్ల కొనుగోలుకు తడిసి మోపడవుతోంది. పిల్లలతో గదులు ఊడిపిస్తే విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలా స్కూళ్లలో శానిటేషన్ పనులు చేసేందుకు, బెల్కొట్టడానికి ఒకరిద్దరు ప్రైవేట్ వర్కర్లను పెట్టుకుంటున్నారు. వీరికి నెలకు రూ.2 వేల నుంచి 3 వేల వరకు జీతాలు ఇస్తున్నారు. ఈ జీతాన్ని కొన్నిచోట్ల హెచ్ఎంలే ఇస్తుండగా కొన్నిచోట్ల టీచర్లూ తలాకొంత వేసుకుంటున్నారు. చాక్పీసులు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర స్టేషనరీ ఖర్చులనూ టీచర్లో.. హెచ్ఎంనో పెట్టుకుంటున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట గతంలో పనిచేసిన విద్యావలంటీర్లను ప్రభుత్వం తొలగించింది. దీంతో ఆయాచోట్ల క్లాసులు జరగక, విద్యాకమిటీల ఆధ్వర్యంలో ప్రైవేట్‌గా వీవీలను పెట్టుకుంటున్నారు.
అసలు ఇస్తే గదా
స్కూల్ మెయింటనెన్స్ గ్రాంట్ ఈ ఏడాది ఇంకా రిలీజ్ కాలేదు. గతంలో రూ. 20 వేల నుంచి 40 వేల వరకు గ్రాంటు వచ్చేది. లాస్ట్ ఇయర్ మాత్రం రూ. 80 వేలు వచ్చింది. ఇందులో రూ. 20 వేలు కరెంట్ బిల్లుకు పోగా, మిగతా అమౌంట్ చాక్పీసులు, డస్టర్లు, హ్యాండ్ వాష్, సబ్బులు, వాటర్, బాత్రూమ్ మెయింటెనెన్స్ కు ఖర్చు చేయాలి. ఈ గ్రాంట్ సరిపోక ఇబ్బంది పడుతున్నారు. కరోనాతో మెయింటనెన్స్ ఖర్చులు పెరిగాయి. కొంతమేరకు దాతల నుంచి తీసుకుంటున్నారు. వేసవి సెలవుల వల్ల చాలా రోజులు మూసి ఉండడం వల్ల స్కూళ్లలో తలుపులు, కిటికీలు పాడయ్యాయి. స్లాబులు పెచ్చులూడుతున్నాయి. ఊడి పడి స్టూడెంట్లకు, టీచర్లకు గాయాలవుతున్నాయి. వీటికి రిపేర్లు చేయించాలి. బళ్లలో కరోనా రూల్స్ కఠినంగా పాటించాలని ఆఫీసర్లు చెప్పారేగానీ ఎక్కడా అమలు కావడం లేదు. మెయింటనెన్స్ గ్రాంట్రాక ఏ స్కూల్లోనూ హ్యాండ్‌వాష్, హ్యాండ్శానిటైజర్స్ కొనడం లేదు. కనీసం సబ్బులనూ అందుబాటులో ఉంచట్లేదు. చాక్‌పీస్‌లు, రిజిస్టర్లు కొనేందుకు కూడా తమ జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తోందని హెచ్ఎంలు అంటున్నారు. సర్కారు బళ్లలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని వాపోతున్నారు.
Also Read:Corporate Power- Indian Politics: అధికారంలో ఉండేది పార్టీలు శాసించేది కార్పొరేట్లు