YCP MLAs: నిన్న ఆనం రామనారాయణరెడ్డి. నేడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇలా ఒక్కొక్కరూ అధికార పార్టీ పై ధిక్కార పతాకం ఎగరేస్తున్నారు. వైసీపీ అధిష్టానం తీరు పై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టుతున్నారు. ఒక్కొక్కరుగా టీడీపీ వైపు అడుగులేస్తున్నారు. నెల్లూరులో రేగిన అలజడి ఇంతటితో ఆగుతుందా ? ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తుందా ? వైసీపీలో జరుగుతున్న వరుస పరిణామాలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంరామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. రెండేళ్ల నుంచి సొంతపార్టీ ఎమ్మెల్యే పై వైసీపీ అధిష్టానం నిఘా పెట్టిందని, తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పలుమార్లు ప్రభుత్వ పనితీరు పై ఆనం విమర్శలు చేశారు. దీంతో ఆనం ఎమ్మెల్యేగా ఉండగానే వెంకటగిరిలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఇంచార్జీగా నియమించారు. దీంతో ఆనం త్వరలో సైకిల్ ఎక్కుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆనం ఎపిసోడ్ ముగియకుండానే మరో వైసీపీ ఎమ్మెల్యే అధిష్టానం పై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తనను అనుమానించాక పార్టీలో కొనసాగనని తేల్చిచెప్పారు. టీడీపీ అధిష్టానం ఒప్పకుంటే టీడీపీ నుంచి పోటీచేస్తానని తేల్చేశారు. దీంతో అధికార పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పై వైసీపీ స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఎమ్మెల్యేలు తమతో ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ వైసీపీ అధిష్టానం దానిని ఖండించే ప్రయత్నం చేయలేదు. కేవలం రికార్డింగ్ చేశారని, ట్యాపింగ్ చేయలేదని దాటవేత వైఖరి అవలంభిస్తోంది.

కోటంరెడ్డి మరో అడుగు ముందుకేసి కీలక విషయం వెల్లడించారు. తనతో 31 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారని, వారి ఫోన్లు కూడా ప్రభుత్వం ట్యాప్ చేసినట్టు.. వారు తనకు చెప్పారని ఆరోపించారు. తనతో ఇప్పటి వరకు 31 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, ఇద్దరు మంత్రులు మాట్లాడారని, వారంతా కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులేనని చెప్పారు. కోటంరెడ్డి కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం సొంత ఎమ్మెల్యేల పై నిఘా పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ భయపడటం వల్లే ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
త్వరలో మరింతమంది ఫోన్ ట్యాపింగ్ బాధిత ఎమ్మెల్యేలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే జిల్లా, ఒకే సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ పేరుతో వీధికెక్కడం.. టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించడం వైసీపీని కలవరానికి గురిచేస్తోంది. ఇంకా 15 నెలలు అధికారం ఉండగా.. ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించడం కార్యకర్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. 175 సీట్లు గెలుస్తామన్న జగన్ ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేల పై నిఘా పెట్టడం దేనికి సంకేతమో అర్థం కావడంలేదు. భయం లేకుంటే అనుమానమెందుకు.
