
కేంద్రంలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు తుదిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ ను విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024లో రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.
అయితే.. కేంద్ర కేబినెట్లో గరిష్టంగా 81 మందికి స్థానం కల్పించొచ్చు. ప్రస్తుతం చూస్తే.. ఏపీ కేబినెట్ లో మొత్తం 53 మంది మంత్రులు ఉన్నారు. ఈ లెక్కన మరో 28 మందికి ఛాన్స్ కల్పించొచ్చు. దీంతో.. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు బీజేపీ నేతలతోపాటు సంఘ్ పెద్దలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కసరత్తు తుది దశకు చేరినట్టుగా కూడా ప్రచారం సాగుతోంది.
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకమైన రాష్ట్రం. ఇక్కడ సత్తా చాటితే.. దేశవ్యాప్తంగా అనుకూల వాతావరణం సాధించడం తేలికవుతుందని జాతీయ పార్టీలు నమ్ముతుంటాయి. అందుకే.. యూపీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. 403 స్థానాలు ఉన్న యూపీ అసెంబ్లీలో.. గత ఎన్నికల వేళ 320 స్థానాలు గెలుచుకొని సత్తాచాటింది ఎన్డీఏ. కానీ.. ఈ సారి పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు కాషాయ పెద్దలు.
ఇందులో భాగంగానే.. కేంద్ర కేబినెట్లో యూపీకి అధిక ప్రయారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రం నుంచి పలువురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో.. మధ్య ప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం నుంచి శర్బానంద సోనోవాల్, బిహార్ నుంచి ఎల్జేపీ చీలిక వర్గం నేత పవుపతి పరాస్ కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
వీరితోపాటు జనతాదళ్ యునైటెడ్ నుంచి లాలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహా కు మంత్రి పదవి దక్కొచ్చని వార్తలు వస్తున్నాయి. బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ, మహారాష్ట్ర నాయకుడు నారాయణ్ రాణే, భూపేద్ర యాదవ్ కూడా కేబినెట్ బెర్త్ ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే ఉన్నవారిలో పనితీరును బట్టి కొందరికి ఉద్వాసన పలకొచ్చని కూడా అంటున్నారు. దీంతో.. కొత్త కేబినెట్ లో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్లిపోతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.