Kargil Vijay Diwas 2024: దేశ చరిత్రలోనే కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకత ఉంది. ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసింది. సరిహద్దులు దాటుకొని అక్రమంగా ఇండియాలోకి చొరబడిన పాకిస్తాన్ సైన్యం, మిలిటెంట్లను జవాన్లు తరిమికొట్టిన ప్రాంతాన్ని కార్గిల్ అంటారు. కార్గిల్ ను విడిపించుకునే క్రమంలో పాకిస్తాన్ పై ఓ మినీ యుద్ధమే చేసింది ఇండియా. ఈ యుద్ధంలో 490 మంది ఆర్మీ అధికారులు, సైనికులు వీరమరణం పొందారు. కార్గిల్ సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. దీనిని స్వాధీనం చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంలోకి ప్రవేశించారు పాక్ సైనికులు, ఉగ్రవాదులు. కార్గిల్ పొరపాటున తొలిసారిగా 1999 మేలో గుర్తించారు. ఆ వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. దాదాపు రెండున్నర నెలల పాటు పాక్ తో భీకర యుద్ధం నడిచింది. దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్ పొరపాటుదారులను తరిమికొట్టారు. ఆపరేషన్ విజయ్ లో భాగంగా టైగర్ హిల్ స్వాధీనం అయ్యింది. 1999 జూలై 26న కార్గిల్ పాక్ చెర నుంచి విముక్తి కలిగింది. అయితే కార్గిల్ యుద్ధం ప్రతి భారతీయుడిలోనూ చెరగని ముద్ర వేసింది. దేశభక్తిని చాటింది. వందలాదిమంది ఆర్మీ అధికారులు, సైనికులు వీర మరణం పొందడం కలచివేసింది. కానీ ఆ యుద్ధంలో భారత్ పై చేయి సాధించడంతో అమరుల త్యాగాలకు జోహార్లు అర్పించింది యావత్ భారతదేశం. అప్పటి నుంచి ఏటా జూలై 26న కార్గిల్ దివాస్ జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయ్ దివస్ వేడుకల్లో దేశ ప్రముఖులు పాల్గొనున్నారు.
* 1971లో భీకర యుద్ధం
వాస్తవానికి భారత్, పాకిస్తాన్ ల మధ్య 1971లో పెద్ద యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత్ సహాయం చేసింది. ఈ యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఈ యుద్ధం ముగిసిన సియాచిన్ హిమ పర్వతాలు ఇరువైపులా పాకిస్తాన్, భారత్ సైన్యాలు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. 1998లో రెండు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేయడంతో శత్రుత్వం తారాస్థాయికి చేరింది. అయితే దానిని తగ్గించుకునేందుకే 1999లో రెండు దేశాల మధ్య లాహోర్ డిక్లరేషన్ ఒప్పందం జరిగింది. కానీ పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చూపించింది. ఆ ఏడాది మేలు కార్గిల్ లోని ద్రాస్, బతలిక్ ప్రాంతాల్లోకి సైనికులను పంపింది. భారత సైనిక స్థావరాలను ఆక్రమించుకునే పనిలో పడింది. అప్పుడే యుద్ధం ప్రారంభమైంది. దాదాపు రెండున్నర నెలల పాటు సాగిన యుద్ధంలో చివరికి భారత్ పై చేయి సాధించింది. కానీ వందలాదిమంది ఆర్మీ అధికారులు, సైన్యం అమరవీరులయ్యారు
* విజయ ప్రతీక
కార్గిల్ యుద్ధం భారత సైన్యం విజయ ప్రతీకకు నిదర్శనం. భారత సైన్యం ధైర్య సాహసాలకు, తిరుగులేని జాతీయ కర్తవ్యానికి ప్రత్యేక గా నిలిచింది.’ జూలై 26 కార్గిల్ విజయ్ దివస్’ భారత సాయుధ దళాల అజయమైన ఆత్మ, పరాక్రమాన్ని గౌరవించడానికి ఒక లిఖితపూర్వక నిదర్శనంగా నిలిచింది. అప్పటినుంచి ఏటా జూలై 26న విజయ్ దివస్ గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
* ఏర్పాట్లు పూర్తి
విజయ్ దివస్ వేడుకలకు సంబంధించి లఢక్ ద్రాస్ సెక్టార్ ముస్తాబయ్యింది. వేడుకల్లో ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొనున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ద్రాస్ లో ఏర్పాటుచేసినఅమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనున్నారు. 25వ కార్గిల్ విజయోత్సవ ఉత్సవాలను సైనికులతో కలిసి జరుపుకొనున్నారు.