Joint Karnool District: ప్రస్తుతం తాను విపక్షంలోనున్న సంగతే మరిచిపోయారు. భవిష్యత్ రాజకీయాలు చేయాలంటే వారి సాయం ఉంటేనే అన్న విషయాన్ని గుర్తెరగకుండా వ్యవహరిస్తున్నారు. అష్టకష్టాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలను భరోసా కల్పించాల్సింది పోయి తిరిగి బాధిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వ్యవహార శైలి ఇప్పుడు పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. గత కొద్దిరోజులుగా వివాదాస్పద వ్యవహార శైలితో ఆమె పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. ఇప్పడు పార్టీ శ్రేణులనే టార్గెట్ చేస్తున్నారు. వారి వద్ద కూడా దందా చేయాలని ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో రాజకీయ తెరపైకి వచ్చినా.. అనాలోచిత నిర్ణయాలు, అడ్డగోలు వ్యవహారాలతో వివాదాస్పదమవుతున్నారు. తల్లిదండ్రులకు మాయని మచ్చ తెస్తున్నారు. ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులపై పడ్డారు. కిడ్నాప్ లు, భౌతిక దాడులకు అలవాటు పడ్డ ఆమె చర్యలు తెలిసి పార్టీ శ్రేణులే భయపడిపోతున్నారు. టీడీపీ హయాంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సదరు మహిళా నేత అప్పట్లోనే ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారన్న అపవాదు ఉంది. ముఖ్యంగా నీరుచెట్టు పనులను పది శాతం పూర్తిచేసి.. 90 శాతం చేయకుండానే నిధులు డ్రా చేశారన్న ఆరోపణులన్నాయి.

భేరసారాలు..బెదిరింపులు
గత టీడీపీ ప్రభుత్వంలో నీరుచెట్టు పనులు చేసిన చాలామంది నాయకుల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. ప్రభుత్వం మారడంతో వాటికి మోక్షం కలగలేదు. కొందరు న్యాయపోరాటం చేయడంతో బిల్లులకు మోక్షం కలిగింది. బిల్లులు ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో పనులు చేసిన నాయకులు తెగ ఆనందపడుతున్నారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక నియోజకవర్గంలో మాత్రం పనులు చేసిన వారంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. సదరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మహిళ, మాజీ మంత్రి ఇప్పుడు భేరసారాలకు దిగుతుండడమే ఇందుకు కారణం. తనకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులో 25 శాతం ఇవ్వాల్సిందేనని ఆమె తెగేసి చెబుతున్నారుట. తాను మంజూరు చేయించిన పనులు గనుక తప్పకుండా ముట్టజెప్పాల్సిందేనని హెచ్చరిస్తున్నారుట. కాదు కూడదని తిరగబడితే మాత్రం మీరు చేసిన పని ఎంత? నిధులు ఎంత పక్కదారి పట్టించారో బయటపెడతానంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతుండడంతో పనులు చేసిన వారు బెంబేలెత్తిపోతున్నారు. ఆపసోపాలు పడి పనులు చేసింది మేము.. ఇప్పటివరకూ బిల్లులు రాకున్నా పట్టించుకోలేదని.. ఇప్పుడు బిల్లులు వచ్చిన సమయానికి ఈ బెదిరింపులు ఏమిటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా కమీషన్ ఇచ్చి షటిల్ చేసుకోవాలని.. లేదంటే గట్టి పర్యవసానాలే ఉంటాయని హెచ్చరిస్తుండడంతో వారంతా హైరానా పడుతున్నారు. కష్టకాలంలో సపోర్టుగా నిలిచినందున ఆమె తమకు తగిన శాస్తే చేస్తుందంటూ నిట్టూర్చుతున్నారు.
అధిష్టానం వద్ద తాడోపేడో..
అయితే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డ అని కడుపులో పెట్టుకుని చూసుకున్నామని ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆ నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. తల్లిదండ్రులతో ఉన్న సాన్నిహిత్యం వదులుకోలేక.. ఆమె ఏ పార్టీ వెంట నడిస్తే అటే వెళ్లామని.. గత ఎనిమిదేళ్లుగా ఆటుపోటులు ఎదుర్కొన్నామని చెబుతున్నారు. ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి బిల్లులు తెచ్చుకుంటే ఇప్పుడూ వదలకపోవడాన్ని ఆక్రోషిస్తున్నారు. అనుచరులమని కూడా చూడకుండా ఆమెతో పాటు భర్త బెదిరింపులకు దిగుతుండడాన్ని సహించలేకపోతున్నారు. అధిష్టానంవద్దే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు.