https://oktelugu.com/

Karnataka CM: ఇదెక్కడి పంచాయితీరా నాయనా.. ఢిల్లీకి కర్ణాటక నేతలు!

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి అక్కడి ప్రజలు అసెంబ్లీ ఎన్నిల్లో సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. 135 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో విజయం సాధించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 15, 2023 10:53 am
    Karnataka CM

    Karnataka CM

    Follow us on

    Karnataka CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా.. ముఖ్యమంత్రిని ప్రకటించలేని పరిస్థితి నెలకొంది. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే నేతల తీరే ఆ పార్టీకి శాపంగా మారుతోంది. క్రమశిణ తప్పి వ్యవహరించడం, ఎవరికి వారే ఆధిపత్యం చెలాయించాలనుకోవడం హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలోనే అంతర్గత ప్రజాస్వామ్యం.. కాదు కాదు.. అతి స్వేచ్ఛ ఆ పార్టీని మళ్లీ చులకన చేస్తోంది. వీరు మారర్రా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

    ఇంటిపోరు..
    కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి అక్కడి ప్రజలు అసెంబ్లీ ఎన్నిల్లో సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. 135 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో విజయం సాధించారు. కొందరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కానీ ఇంటి పోరుతో కాంగ్రెస్‌ పెద్దలు హడలిపోతున్నారు. ఆహో ఓహో అంటూ ఆదివారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ నాయకులు సీఎల్‌పీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకున్న ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ పెద్దలు బిక్క ముఖం వేశారు. భోజనాలు అయిన తరువాత ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ నాయకులు తెలుసుకున్నారు.

    ఢిల్లీ నుంచి పిలుపు..
    ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకున్న హైకమాండ్‌ దూతలు సీఎం ఎంపిక తమతో కాదని గుర్తించారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అభిప్రాయంతో ఢిల్లీ బయల్దేరిన దూతలు, వెళ్తూ వెళ్తూ.. ఢిల్లీకి రావాలని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్‌కు సూచించారు. పంచాయితీ తేల్చేందుకు ఢిల్లీకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది.

    ఆ నలుగురే పంచాయితీ పెద్దలు..
    సోమవారం ఢిల్లీ వెళ్లనున్న మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్‌ కాంగ్రెస్‌ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. వేర్వేరుగా అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నలుగురు పంచాయితీ పెద్దలుగా ఇద్దరితో మాట్లాడతారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను వారిముందు పెడతారని సమాచారం. ఇద్దరూ పంతాలు వీడితే.. ఎవరో ఒకరిని సీఎంగా ప్రకటించే అవకాశం ఉంది. అలా కుదరని పక్షంలో 50:50 ఫార్ములాను ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. అయినా.. ముందు ఎవరు సీఎం కావాలనే విషయంలో మళ్లీ సమస్య రావొచ్చని తెలుస్తోంది.