Director Sudipto Sen: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమాకు సుదోప్తో సేన్ దర్శకత్వం వహించాడు. అదా శర్మ కీలకపాత్ర పోషించింది. చిన్న సినిమానే అయినా.. వివాదాస్పదం అంశం కావడంతో ఎక్కువ మంది సినిమా చూస్తున్నారు. మరోవైపు బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు సుదోప్తో సేన్ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాడు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా ర్యాలీలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, అస్వస్థతకు గురైన కారణంగా కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెబుతూ ట్విట్టర్ వేదికగా కారణం వెల్లడించారు. ‘ఈరోజు(ఆదివారం) మేం(ది కేరళ స్టోరీ టీమ్) కరీంనగర్ రావాల్సి ఉంది. మా సినిమా గురించి చర్చించాల్సి ఉంది. కానీ, ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో రాలేకపోతున్నా. కరీంనగర్ ప్రజలకు క్షమాపణలు తెలియజేస్తున్నా. మన కుమార్తెలను రక్షించేందుకు మేం ఈ సినిమా తెరకెక్కించాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి’ అని సుదీప్తో సేన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
యాక్సిడెంట్ అయినట్లు ప్రచారం..
ఇదిలా ఉంటే.. సుదీప్తో సేన్, ఆదా శర్మకు ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, దర్శకుడు మాత్రం తన అస్వస్థతపై క్లారిటీగా చెప్పలేదు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
ధర్మ రక్షణ కోసమే హిందూ ఏక్తాయాత్ర..
ఇది ఇలావుంటే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ’హిందూ ఏక్తా యాత్ర’ జరిగింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం పాటపడేందుకే ఈ యాత్ర అని తెలిపారు. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన హిమంత్ బిశ్వశర్మకు హైదరాబాద్‌లో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కరీంనగర్‌కు బయల్దేరారు.
పలువురికి బండి ఆహ్వానం..
అసోం సీంతోపాటు బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్, బీజేపీ ముఖ్య నేతలతోపాటు ది కేరళ స్టోరీ టీంకు కూడా బండి సంజయ్ ఆహ్వానం పంపారు. దీంతోవారు కూడా కరీంనగర్ రావాల్సి ఉన్నప్పటికీ.. అస్వస్థత కారణంగా రాలేకపోయారు. కాగా, ది కేరళ స్టోరీ.. లవ్ జిహాద్ నేపథ్యంలో రూపొందిన సినిమా. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తవంతో తెరకెక్కింది ది కేరళ స్టోరీ. విడుదలకు ముందే వివాదాస్పదమైనప్పటికీ.. విడుదల తర్వాత రికార్డులు సృష్టిస్తోంది. మే 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 112 కోట్లు రాబట్టింది. త్వరలో తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.