Telangana New Secretariat Cost: దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెలాఖరులో దీనిని ప్రారంభించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు ఈమేరకు వెల్లడించాయి. ప్రారంభోత్సవం సందర్భంగా పుష్పాల అలంకరణ సహా ఇతర పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు పిలిచినట్లు తెలిపాయి. ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేశాయి. ‘పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తయింది. నిర్మాణ అనంతర పరిశీలన పెండింగ్‌లో ఉంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. అలంకరణ బిడ్డింగ్ గెలుచుకున్న వారు.. తేదీ ప్రకటించిన మూడు రోజుల్లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారు’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఖర్చులపై తెలంగాణలో చర్చ..
తెలంగాణలో ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రూ.600 కోట్ల అంచనాతో 2019లో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం పూర్తయ్యేనాటికి ఖర్చు మరో రూ.వెయ్యి కోట్లు పెరిగింది. దాదాపు రూ.1,600 కోట్ల కొత్త సెక్రటేరియేట్‌కు ఖర్చ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు మూడు రెట్లు ఖర్చు పెరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ప్రకటన రావడంతో తెలంగాణలో భవన నిర్మాణాల ఖర్చులపై కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు భవన ఖర్చుల లెక్కలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
పార్లమెంట్‌కు రూ.820 కోట్లు..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్ మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల స్థలంలో పార్లమెంట్ భవనం సహా కేంద్ర ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నారు. సెంట్రల్ సెక్రెటేరియట్, కొత్త కార్యాలయాలు, ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లను సిద్ధం చేస్తున్నారు. కొత్త పార్లమెంట్ భవన పనులను టాటా గ్రూప్ దక్కించుకుంది. 17 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021, డిసెంబర్ 9న ఈమేరకు ఒప్పందం జరిగింది. కొత్త పార్లమెంట్ భవనం అంచనా వ్యయాన్ని కేంద్రం రూ.971 కోట్లు, 2022, అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పనులు దక్కించుకున్న టాటా గ్రూప్ రూ. 861.90 కోట్లతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. అయితే భవనం పూర్తయ్యే నాటికి అంచన వ్యయం 29 శాతం పెరిగిందని సమాచారం. దీంతో బడ్జెట్ రూ. 1,250 కోట్లకు పైగా చేరింది.
సెక్రటేరియేట్ ఖర్చు మూడింతలు..
ఇక ఇటీవల ప్రారంభించిన తెలంగాణ సెక్రటేరికేట్ ఖర్చు మాత్రం మూడింతలు పెరిగింది. ప్రతిపాదన సమయంలో నిర్మాణ వ్యయం రూ.400 కోట్లుగా అంచనా వేశారు. ప్రారంభించే నాటికి అది మరో రూ.200 కోట్లు పెరిగింది. ఇక భవనం పూర్తయ్యే నాటికి ఖర్చు మూడింతలు పెరిగింది. అంటే రూ.600 కోట్లతో మొదలు పెట్టిన పనులు పూర్తయ్యేనాటికి రూ.1,600 కోట్లు అయింది.
ట్రోల్ చేస్తున్న బీజేపీ..
తెలంగాణలో బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఇప్పుడు కొత్త సెక్రటేరియేట్, సెంట్రల్ విస్టా ఖర్చును వివరిస్తూ షోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. దేశంలోని పార్లమెంట్ సభ్యులంతా కూర్చునే భవనానికి రూ.1,250 కోట్లు ఖర్చయితే.. సీఎం కేసీఆర్ 18 మంది మంత్రులు, ఆయా శాఖల అధికారులు కూర్చునే భవనానికి మాత్రం రూ.1,600 కోట్లు పెట్టారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ ధన దాహానికి నిదర్శనం అని కొంతమంది.. కమీషన్ కింగ్.. కేసీఆర్ అని, కాళేశ్వరం కమిషన్ కింగ్ అని, కల్వకుంట్ల లెక్క వేరే ఉంటది అని ఇలా పోస్టులు పెడుతున్నారు. అయితే పార్లమెంట్ భవనం లెక్కలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.