Teenmaar Mallanna: తెలంగాణ (Telangana) ప్రభుత్వం తనకు ఎదురు లేకుండా చేసుకుంటోంది. తమపై ఎదురు తిరిగిన వారిని అడ్డు తొలగించుకునే క్రమంలో అరెస్టులకు సైతం వెనకాడడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుకు పలు విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ చానల్ క్యూ న్యూస్ నిర్వాహకుడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు(Teenmaar Mallanna) సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ (14 days remand) విధించింది. అనంతరం పోలీసులు మల్లన్నను చంచల్ గూడ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ లో ఉంచనున్నారు.
మల్లన్న తరఫు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. మల్లన్నపై పెట్టిన కేసులు సరైనవి కాదని ఐపీసీ సెక్షన్ 306, 511 ఎలా పెడతారని ప్రశ్నించారు. మల్లన్నకు 7 రోజుల కస్టడీకి అప్పగించారు. మల్లన్నపై ఐపీసీ సెక్షన్ల కింద 387,504,306,511ల కింద కేసులు పెట్టారు. అయితే సెక్షన్ 306 వర్తించదని తెలిపారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాది పేర్కొన్నారు.
లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడు తీన్మార్ మల్లన్న తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాడని గత ఏప్రిల్ లో చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని కేసు పెట్టాడు. దీనిపై పోలీసులు పలుమార్లు మల్లన్నను స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో శక్రవారం ఆగస్టు 27న రాత్రి మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ స్టేషన్, చిక్కడపల్లి, జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. మల్లన్న ఈనెల 29 నుంచి పాదయాత్ర కోసం ప్రణాళిక రూపొందించుకున్నారు. అలంపూర్ నుంచి ప్రారంభించాల్సిన పాదయాత్ర అనుకోకుండా హుజురాబాద్ కు మార్చినట్లు తెలుస్తోంది.
పాదయాత్ర అడ్డుకునేందుకే మల్లన్నను అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజులుగా మల్లన్న ఏదో ఒక కేసులో పోలీస్ స్టేషన్ల చుట్టు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు సంచలనం సృష్టించింది. భవిష్యత్ లో మల్లన్నను ఎంత మేరకు జైల్లో ఉంచుతారో తెలియడం లేదు. దీనిపై మల్లన్న తనదైన శైలిలో ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు.