Bihar
Bihar: కుటంబం అంటే తల్లిదండ్రులు, భార్య, భర్తలు, పిల్లలు అని అర్థం. ఇలాంటి కుటుంబ వ్యవస్థలో పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. పూర్వ కాలంలో దంపతులు అర డజన్ నుంచి డజన్ మంది పిల్లలను కనేవారు. కానీ జనాభా పెరుగుదల, ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడం వంటి కారణంతో చాలా మంది కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. ఒకరు లేదా ఇద్దరితో సరిపెడుతున్నారు. కొన్ని సామాజికవర్గాల్లో ఇప్పటికీ అధిక సంతానం ఉంది. అయితే మెజారిటీ ప్రజలు తక్కువ సంతానమే మేలనుకుంటున్నారు. ఈ రోజుల్లో అరడజన్ పిల్లలు కూడా ఏ ఇంట్లో కనిపించడం లేదు. కాకపోతే కుటుంబం సభ్యులంతా కలిసి 50 మంది, వంద మంది వరకు ఉంటున్నారు. కానీ, ఓ రాష్ట్రంలో ఓ వ్యక్తి వంద మందికిపైగా తండ్రి అయ్యాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 138 మందికి ఒకే వ్యక్తి తండ్రిగా ఉన్నారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. దీని వెనుక విషయం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏం జరిగిందంటే..
బిహార్‌లోని తిర్హూట్ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటరు జాబితా తయారు చేశారు. ఔరాయ్ బ్లాక్‌లోని బూత్ నంబర్ 54లో 724 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కుమార్ అంకిత్‌గా ఉంది. వీరిలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్ ఝూ ఓటరు జాబితా రూపొందించిన అధికారులను నిలదీశారు.
సాంకేతిక లోపంతో..
ఓటరు జాబితాలో 138 మందికి ఓకే పేరు పడడంపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల అధికారులు కూడా స్పందించారు. వెంటనే పొరపాటు ఎక్కడ జరిగిందని విచారణ చేపట్టారు. చివరకు సాంకేతిక లోపంతో ఇలా జరిగిందని తేల్చారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయి బీహార్‌లోని పార్టీలు. తమకు ఓట్లు పడకుండా ఆపే కుట్రలో ఇది భాగమే అని జేడీయూ నేత ఆరోపించారు. కాగా, ఓటరు జాబితాను మారుస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.