Karnataka Elections 2023: ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల, ఏర్పడింది ప్రజాస్వామ్యం అని అప్పట్లో అబ్రహం లింకన్ మహాశయుడు రాశాడు. అంతటి గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ధనస్వామ్యం ఏలుతోంది. ఏలడం మాత్రమే కాదు.. అన్ని విభాగాల్లోనూ డబ్బున్న వాళ్ళే చక్రం తిప్పుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా కర్ణాటక రాష్ట్రంలో ఆగర్భ శ్రీమంతులు పోటీ చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ విశ్లేషణ ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన దాదాపు సగం మంది అభ్యర్థులు అంటే 2,586 మందిలో 42 శాతం లేదా 1087 మంది కోటీశ్వరులు ఉన్నారు. గత ఎన్నికల్లో 35 శాతం మంది మాత్రమే కోటీశ్వరులు ఉండగా.. ఈసారి వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఒక్కో అభ్యర్థికి సగటున ఆస్తి 12.26 కోట్లు ఉండగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇది 7.5 కోట్లు మాత్రమే ఉంది.
పార్టీల వారీగా ఇలా
కాంగ్రెస్ పార్టీ నుంచి 97%, భారతీయ జనతా పార్టీ నుంచి 96%, జెడిఎస్ నుంచి 82% మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నారు. ఇక ఎన్నికల బరిలో నిలిచిన అత్యంత కోటీశ్వరుడు యూసుఫ్ షరీఫ్.. ఈయనను “కేజీఎఫ్ బాబు” అని కూడా పిలుస్తారు. బెంగళూరులోని చిక్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈయన ఆస్తులు 1633 కోట్లకు మించి ఉన్నాయని ఆయన ప్రకటించారు.
ఎన్. నాగరాజు
బిజెపి ప్రభుత్వంలో చిన్న తరహా పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రిగా ఈయన పని చేశారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి ఆయన మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆస్తుల విలువ 1609 కోట్లకు పై మాటే.
డీకే శివకుమార్
కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ఈయన ఆస్తులు 1413 కోట్లు. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
ప్రియా కృష్ణ
ప్రియా కృష్ణ 2009 బెంగళూరులోని గోవింద రాజు నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్ణాటక మాజీ మంత్రి కృష్ణప్ప పెద్ద కుమారుడు ఈయన. ప్రస్తుత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈయన ఆస్తులు 1156 కోట్లు.
బి ఎస్ సురేష్
ఈయన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. ఈయన ఆస్తుల విలువ 648 కోట్లు. వీరే కాకుండా చాలామంది శ్రీమంతులు ఎన్నికల్లో పోటీ చేశారు. తమ అఫిడవిట్లో కోట్లల్లో ఆదాయం ఉందని చూపించారు. అయితే ఈ జాబితాలో పై వ్యక్తులే అత్యధికంగా సంపద కలిగి ఉన్నారు.