
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో 151 స్థానాలు, లోక్ సభలో 22 సీట్లు గెలిచిన వైసీపీ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. మే 23తో ఈ విజయానికి ఏడాది నిండటంతో వేడుకలు చేసుకోవాలన్న వైసీపీ శ్రేణులకు కరోనా వైరస్ సంక్షోభం చెక్ పెట్టింది. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహనికి గురయ్యాయి. అయితే వీళ్ళు ఇంతటితో ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ గెలుపు పండుగను జరుపుకుంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు నుంచి సాధారణ కార్యకర్తల వరకూ వారి సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా గతేడాది మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మే 23వ తేదీ చారిత్రక విజయానికి ఏడాది అంటూ వైసీపీ ట్విట్టర్ లో పేర్కొంది. రాజన్న బిడ్డ, జనహృదయ నేత అంటూ సీఎం జగన్ ను కొనియాడింది. అంతేకాదు, విశ్వసనీయతకు పట్టం కట్టి ఏడాది అంటూ కొన్ని వీడియో క్లిపింగ్స్ ను కూడా పంచుకుంది.
బహిరంగంగా వేలాది మంది మద్య వేడుకలు చేసుకోవడం అలవాటుగా మరినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో పార్టీ శ్రేణులకు ఈ అవకాశం లభించే పరిస్థితి లేదు. ఇది ఈ ఒక్క పార్టీకే పరిమితం కాదు, గత నెలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఇదే విధంగా ఇళ్లకే పరిమితం అయ్యింది. కమ్యూనిస్టు పార్టీలు మే డే వేడులను కొద్ది మంది కార్మికులతో నిరాడంబరంగా జరుపుకున్నాయి. మరి కొన్నాళ్ళు ఈ పాట్లు తప్పవు మరి.