
Minor Girls Stripped Naked: ‘విద్యలేని వాళ్లు వింత పశువులు’ అన్నది చిన్నప్పుడు చదువుకున్న సూక్తి. అది ఎంత నిజమో చాటిచెప్పే సంఘటన ఇది. ఆచారాలు, సంప్రదాయాల సాలెగూళ్ల నుంచి బయటకు రాలేకపోతున్న కొందరు.. నిజంగా పశువులుగానే ప్రవర్తిస్తున్నారు. వర్షాలు ఎలా కురుస్తాయో తెలియని జనం.. అమ్మాయిల దుస్తులు విప్పించి, నగ్నంగా భిక్షాటన చేయించారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయంట! ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో జరిగింది.
దామోహ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. అక్కడ ఈ ఏడాది సరిగా వర్షాలు కురవలేదు. దీంతో.. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఘోరమైన పనికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఆరుగురు అమ్మాయిలను దుస్తులు విప్పించి, నగ్నంగా ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేయాల్సిందిగా ఆదేశించారు. ఒక కర్రకు వస్త్రం కట్టి, అందులో కప్పను ఉంచి, అదే కర్రకు బరువైన రోలును కట్టి, దాన్ని వారితో మోయించారు.
ఆ రోలును మోసుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ బాలికలు భిక్షాటన చేశారు. ఈ భిక్షాటన ద్వారా సేకరించిన బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను గ్రామదేవత ఆలయం ఎదురుగా పెట్టి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ఆ మొత్తాన్ని వండి గ్రామంలోని వారికి అన్నదానం చేస్తారు. ఇలా చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయట! బాలికలు భిక్షాటన చేస్తున్న అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో.. జాతీయ బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి, నివేదిక అందించాలని దామోహ్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. కాగా.. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. కాగా.. ఓవైపు ప్రపంచం అంతరిక్షయానం చుట్టూ తిరుగుతుంటే.. మన దేశంలో ఇంకా జనాలు మూఢ నమ్మకాలతో మగ్గిపోతూ దారుణాలకు పాల్పడుతుండడం అత్యంత బాధాకరం.