
తమిళనాడు బాటలో తెలంగాణలో కూడా ఉద్యోగ విరమణ వయస్సును 58 ఏళ్ళ నుండి 60 సంవత్సరాలకు పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై అధికారులు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. తమినాడులో 58 ఏళ్ళ నుండి ఒక ఏడాది పాటు 59 సంవత్సరాలకు రెండు రోజుల క్రితమే పెంచారు.
ఆగష్టు 1 నుండి ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా 2023 జులై 31 నాటికి పదవీ విరమణ చేయనున్న 26,588 మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు అదనపు సర్వీసు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉద్యోగ విరమణ రోజుననే వారికి షష్టి పూర్తి ఉత్సవం కూడా జరిపే సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సగటున సుమారు రూ. 3,500 కోట్లు, మొత్తం మూడేళ్ళలో రూ.10, 500 కోట్ల మేరకు వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నారు.
అయితే ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా నిరుద్యోగ యువకులలో నిస్పృహ కలగకుండా వారికోసం ఉద్యోగ అర్హత వయస్సును కూడా పెంచేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.