
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి కుమారుడి వివాహాన్ని చేసిన మాజీ సీఎం కుమారస్వామిని లక్ష్యంగా చేసుకొని కర్ణాటకలోని బిజెపి నేతలు విమర్శలు చేస్తుంటే ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డియూరప్ప మాత్రం ఈ విషయంలో మాజీ సీఎంను వెనుకవేసుకు రావడం బిజెపి వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది.
‘‘ఆ వివాహం గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదు. అవసరమైన అనుమతులన్నీ ఇచ్చాం. వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగింది. వారి వారి పరిమితుల్లో బాగానే చేశారు. అందుకు నేను వారిని అభినందిస్తున్నా’’ అంటూ యడియూరప్ప ఈ వివాదానికి ముగింపు పలికారు.
దేశవ్యాప్త లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా, ముందే నిర్ణయించిన తేదీ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఇంట వివాహ శుభకార్యం జరిగింది. రాంనగర జిల్లాలో ఉన్న ఆయన ఫాంహౌజ్‌లో ఈ వివాహం జరిగింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యడియూరప్ప… ఈ పెళ్లిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరంచినట్లే అవుతుందని స్పష్టం చేశారు.
అయితే 24 గంటల లోపే ముఖ్యమంత్రి వైఖరిలో ఈ విధమైన మార్పు ఏమిటి ఎవ్వరికీ అర్ధం కాలేదు. బొటాబొటి మెజారిటీతో తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎప్పుడైనా అవసరమైతే జేడీఎస్ మద్దతు లభిస్తుందనే ముందు చూఫుతో యడ్డియూరప్ప అకస్మాత్తుగా తన ధోరణిని మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.