
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి కార్యదర్శిగా అదనపు బాధ్యతలు వహిస్తున్న శాసనసభ కార్యదర్శిపై ధిక్కార పిటిషన్ ఏపీ హై కోర్ట్ నేడు విచారణకు స్వీకరించింది. టిడిపి ఎమ్యెల్సీ దీపక్ రెడ్డి వేసిన పిటీషన్ ను విచారించిన హై కోర్ట్ ప్రభుత్వ సమాధానం కోసం వాయిదా వేసింది.
మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ సర్కారు తీసుకొచ్చిన రెండు బిల్లులను.. శాసన మండలి ఛైర్మన్‌గా తనకున్న విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపాలని షరీఫ్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి కార్యదర్శికి నోటీసులు పంపించింది. తదుపరి విచారణ వచ్చే నెల 22కి వాయిదా వేసింది.
శాసన మండలి చైర్మన్ సర్వాధికారి అని, ఆయన ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని పిటిషన్‌లో దీపక్ రెడ్డి తెలిపారు. విశేష అధికారాలనుపయోగించి సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తే మండలి కార్యదర్శి వాటిని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో ఉటంకించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారంపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని మండలి చేసిన తీర్మానం మేరకు చైర్మన్ పంపిన ఆదేశాన్ని మండలి కార్యదర్శి ఖాతరు చేయలేదని అందులో దీపక్ రెడ్డి ఆరోపించారు.
బిల్లుల పరిశీలనకు 8 మందితో సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి తీర్మానించినా కమిటీ ఏర్పాటు చేయలేదని దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శాసనమండలి కార్యదర్శి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహిస్తూ నిబంధనలను పాటించడం లేదని పేర్కొన్నారు.
క్విడ్ ప్రొకో కింద మండలి కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించారని తెలిపారు. ప్రతివాదులుగా మండలి కార్యదర్శి, ప్రభుత్వం, సహాయ కార్యదర్శి పేర్లను దీపక్ రెడ్డి తన పిటిషన్‌లో చేర్చారు.