
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఎట్టోపోతల సామర్ధ్యాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జిఓ విడుదల చేస్తే మౌనం వహిస్తూ ఉండడంతో కాంట్రాక్టర్ల నుండి కమీషన్ల కోసం జగన్ తో లాలూచి పడుతున్నారని ప్రతిపక్షాలనుండి విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఎట్టకేలకు నోరు విప్పారు. జగన్ ఏకపక్ష ధోరణులపై విరుచుకు పడ్డారు.
ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామని కేసీఆర్ స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు భంగకరమని అంటూ దీనిపై రాజీలేని ధోరణి అవలంబిస్తామని, ప్రాజెక్టును అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంచేయాలని, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయాలని, కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనితో పరస్పరం చర్చల ద్వారా నీటి జలాల వివాదాలు పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు రెండు, మూడు సార్లు జరిపిన సమావేశాలకు ఇక మంగళం పాడినట్లే అనే స్పష్టం అవుతున్నది.
శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల కృష్ణాజలాలను ఎత్తి కుడి ప్రధాన కాల్వలో పోయడంతోపాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచేందుకుగాను విస్తరణ, లైనింగ్ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను సైతం 30వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి పెంచాలని తీర్మానించింది.
ఈ పనులకు రూ.6,829.15 కోట్ల అంచనా వ్యయానికి పాలనా ఆమోదం తెలుపుతూ ఈ నెల 5వ తేదీన జీవో జారీచేసింది. శ్రీశైలం నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీల జలాల తరలింపు లక్ష్యంగా అందులో పేర్కొంది.
కాగా, ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి ఐదున్నర టీఎంసీల వరకు జలాల్ని తరలించే వ్యవస్థ ఉండగా అదనంగా ఈ పనులు చేపట్టడంతో 1.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో రోజుకు 10 టీఎంసీల జలాల్ని ఏపీ తరలించుకుపోతుందని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.
కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న స్నేహంతో పాటు రెండు రాష్ట్రాలలో కీలక నీటిపారుదల ప్రాజెక్ట్ లను ఎక్కువగా ఇద్దరే కాంట్రాక్టర్లు చేబడుతూ ఉండడంతో ఇద్దరు సీఎంలు లాలూచి పడ్డారని, అందుకనే కేసీఆర్ నోరు మెదపడంలేదని కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
దానితో ఎట్టకేలకు కేసీఆర్ ఈ విషయమై ప్రగతిభవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణను సంప్రదించకుండానే శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఏపీ చేసిన తప్పిదాలుగా కేసీఆర్ ఈ సందర్భంగా మండిపడ్డారు.
పైగా, ఈ సందర్భంగా జగన్ పై విసుర్లు కూడా విసిరారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలని తాము ఆశిస్తే.. ఏపీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని స్నేహబంధానికి విఘాతం కలిగించిందని అంటూ ధ్వజమెత్తారు.