Sakshi Twitter News : ‘‘ముఖ్యమంత్రి జగనో మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? లేదా?’’ అని రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోంది. మీడియాలన్నీ ప్రతినిధులతో సిద్ధంగా ఉన్నాయి. సీబీఐ కోర్టు ఏం తీర్పు చెబుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ లోగా కలకలం రేగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను.. సీబీఐ న్యాయస్థానం తోసి పుచ్చింది అని సాక్షి ట్విటర్ హ్యాండిల్ లో పోస్టు పబ్లిష్ అయ్యింది. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించలేదన్న వాదనతో కోర్టు ఏకీభవించిందని రాసుకొచ్చారు. కానీ.. అసలు విషయం ఏమంటే.. అప్పటికి ఇంకా న్యాయస్థానం తీర్పు చెప్పనేలేదు. దీంతో.. ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.
కోర్టు తీర్పు ఇవ్వకుండానే.. ఈ విషయం సాక్షి మీడియాకు ఎలా తెలిసింది? అంటూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో.. వెంటనే ఆ పోస్టును తొలగించారు. కానీ.. అప్పటికే నష్టం జరిగిపోయింది. చాలా మంది ఆ పోస్టును స్క్రీన్ షాట్లు తీసుకొని.. ప్రశ్నలు ఎక్కుపెట్టారు. సీబీఐ కోర్టు తీర్పు సాక్షికి ముందుగా తెలియడానికి కారణమేంటీ? ఆ మధ్య జరిగిన కిషన్ రెడ్డి – జగన్ మోహన్ రెడ్డి భేటీని కూడా ప్రస్తావిస్తూ.. ‘‘అండర్ స్టాండింగ్’’ ఏమైనా జరిగిందా? అని కూడా సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్లు. సమాచార లోపం వల్ల జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని సాక్షి ట్విటర్ హ్యాండిల్ ప్రకటించినా.. వివాదం సద్దుమణగలేదు.
ఇదే విషయమై రెబల్ ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణే అని, తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సమన్లు జారీచేసింది. దీంతో.. సాక్షి ఎడిటర్ మురళి తదితరులు కోర్టు ఎదుట హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కోరారు. కానీ.. వచ్చే సోమవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఇదిలాఉంటే.. ముందస్తు అంచనా మేరకు కొన్ని విషయాల్లో మీడియా సంస్థలు టెంప్లెట్లు రెడీ చేసుకొని ఉంచుకుంటాయి. అయితే ఇది.. లేకుంటే అది.. అన్నట్టుగా రెండు విషయాలనూ సిద్ధంగా ఉంచుకుంటారు. విషయం తేలిన తర్వాత దానికి సంబంధించిన వార్తను పబ్లిష్ చేస్తారు. అయితే.. ఇక్కడ సాక్షి ట్విటర్ హ్యాండిల్ ను చూసే ఉద్యోగి అత్యుత్సాహం కారణంగా.. తీర్పు వెలువడకుండానే ఈ న్యూస్ పబ్లిష్ చేసి ఉంటారని అనుకుంటున్నారు. మొత్తానికి.. తొందరపాటు కోర్టు మెట్లు ఎక్కించింది