Huzurabad, Harish Rao : టీఆర్ ఎస్ పార్టీకి సరిగ్గా సరిపోయే ఉదాహరణ. కాంగ్రెస్-కమ్యూనిస్టులకు ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు సాగుతున్న రోజులవి. ఒక ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టు నేత మాకినేని బసవపున్నయ్య మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతోంది. కమ్యూనిస్టు(Communist party) పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి తీరబోతోంది. సంబరాలకు సిద్ధంగా ఉండండి’ అని అన్నారు. కానీ.. కమ్యూనిస్టు పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీనిపై పాత్రికేయులు స్పందిస్తూ.. ‘మీరు అఖండ విజయం సాధిస్తామని చెప్పి, ఒక్క సీటు కూడా గెలవలేదేంటీ’ అని అడిగారు. దానికి మాకినేని బదులిస్తూ.. ‘‘నాయకుడిగా నేను కార్యకర్తలను యుద్ధానికి సిద్ధం చేయడానికి వాళ్లను ఉత్సాహ పరచాలి. విజయానికి అడుగు దూరంలోనే ఉన్నామని చెప్పాలి. లేకపోతే.. ఓటమి ముందే ఖరారైపోతుంది.’’ అని అన్నారు.
ఈ ఉదాహరణ అన్ని పార్టీలకూ వర్తిస్తుంది. పార్టీని నడిపించే నాయకుడు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడానికి.. గెలుపు మనదేనని ఉత్తేజపరచాలి. ఓటర్లలోనూ ఆ భావన కల్పించాలి. ప్రతి ఎన్నికకూ ఇది ప్రాథమిక గెలుపు సూత్రం. అలాంటిది.. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుందని అందరూ భావించే హుజూరాబాద్(Huzurabad) ఉప ఎన్నిక కోసం పార్టీలు ఇంకెంతగా సిద్ధమవ్వాలి? ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వాలి? అది వదిలేసి.. ఈ ఎన్నికకు పెద్ద ప్రాధాన్యత లేదన్నట్టుగా మాట్లాడితే? ఓడినా ఒకటే.. గెలిచినా ఒకటే అని అంటే? లోకల్ లీడర్లు చూసుకుంటారని చెబితే..? కావాల్సినన్ని అనుమానాలు బయల్దేరుతాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందో అందరికీ తెలిసిందే. ఏకంగా.. ‘దళిత బంధు’ వంటి సంచలన పథకానికి కారణం హుజూరాబాదే అన్న సంగతి బహిరంగ రహస్యం. కేవలం ఈ ఉప ఎన్నిక కోసమే తెచ్చారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కూడా పరోక్షంగా ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు కూడా. ఇక, హుజూరాబాద్ లో జనం అడగడమే ఆలస్యం అన్నట్టుగా.. రేషన్ కార్డులు, పింఛన్లు ఇతరత్రా పథకాలు కూడా అందిస్తున్నారనే ప్రచారం సాగింది.
అటు.. ఉప ఎన్నిక బాధ్యత తీసుకున్న హరీశ్‌రావు.. గులాబీ పార్టీని గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈటలతో సై అంటే సై అంటున్నారు. అయితే.. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రిగా కేటీఆర్ (KTR) ఉన్నారు. ఆయన టీఆర్ ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. కాబట్టి.. ఏ విధంగా చూసినా.. ఈ ఉప ఎన్నిక బాధ్యత ఆయనే తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. కానీ.. హరీష్ ను రంగంలోకి దించారు.
ఈ సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. గులాబీ పార్టీ ఓడిపోయే చోట హరీష్ కు బాధ్యతలు అప్పగిస్తున్నారనే చర్చ జరిగింది. దీనికి ఉదాహరణగా దుబ్బాకను చూపిస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో త్రాసు ఈటల వైపే మొగ్గు చూపుతోందనే విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో.. ఇక్కడ కూడా బరువు హరీష్ రావు నెత్తినే పెట్టేశారు. అయినప్పటికీ.. ఆయన ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో విజయం తమదేనని చెప్పాల్సిన కేటీఆర్.. కారుకు ఎదురు లేదని చెప్పాల్సిన వర్కింగ్ ప్రెసిడెంట్(TRS working President).. అదో చిన్న ఎన్నిక అని చెప్పడంలో ఆంతర్యమేంటి? అనే చర్చ సాగుతోంది. ఆ మధ్య రాష్ట్ర కమిటీ సమావేశంలో ఇదే మాట అన్న కేటీఆర్.. ఇప్పుడు ఇతర సమావేశాల్లోనూ అదే మాట్లాడుతున్నారు. తద్వారా.. ఆ ఎన్నికకు ప్రాధాన్యం లేదు అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవన్నీ చూసినప్పుడు.. హుజూరాబాద్ లో కారు ఓడిపోతుందని పార్టీ భావిస్తోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. ఈ ఎన్నికకు ప్రాధాన్యం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలిస్తే.. కేసీఆర్ గెలుపు.. ఓడితే హరీష్ రావు ఓటమి అన్నట్టుగా పరిస్థితిని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా.. ఈ ఎన్నికలో హరీష్ రావు అభిమన్యుడిగా మారారని అంటున్నారు. ఇక్కడ ఓటమి ఎదురైతే.. హరీష్ ఇమేజ్ మరింత డ్యామేజ్ కావడం ఖాయమని.. దీంతో కేటీఆర్ కు టీఆర్ ఎస్ లో ఎదురు లేకుండా చేసే కార్యక్రమం కూడా ఈ ఎన్నికలో ఇమిడి ఉందని అంటున్నారు. మరి, ఫైనల్ గా ఏం జరుగుతుందన్నది చూడాలి.